99TV News

    Nands World London Visa Scam: రూ.20 కోట్ల మోసం.. రమా నందన అరెస్ట్

    Nandus World Couple London Visa Scam

    'నందూస్ వరల్డ్' దంపతుల ఘరానా మోసం.. లండన్ వీసా ఆశ చూపించి రూ. 20 కోట్ల దోపిడీ

    యూట్యూబ్‌లో చూస్తే ఆడంబరమైన విదేశీ జీవితం...లండన్ వీధుల్లో కారెక్కి తిరిగే విలాసవంతమైన లైఫ్ స్టైల్...దానికి తోడు లక్షలాది మంది ఫాలోవర్ల నమ్మకం.. కానీ ఆ మెరుపుల వెనుక ఒక నమ్మకద్రోహపు నల్లటి సామ్రాజ్యం ఉందనే నిజం తెలిస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తమ సోషల్ మీడియా ఇమేజ్‌ను ఒక పెట్టుబడిగా మార్చుకుని, లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయక నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన 'నందూస్ వరల్డ్' దంపతుల కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విదేశాల కెరీర్ ఆశలను అమ్ముకుని రూ. 20 కోట్ల వరకు స్కామ్ చేసిన ఈ జంట గుట్టు రట్టయింది.

    'నందూస్ వరల్డ్' ఛానెల్ నడుపుతున్న మధుకర్, రమా నందన దంపతులు లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం వీడియోలు పోస్ట్ చేస్తూ ఈ జంట లక్షలాది మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తమ మాటలతో, ఆకర్షణీయమైన దృశ్యాలతో జనాన్ని ఆకట్టుకున్న ఈ కపుల్... తమ ప్రచారం వెనుక ఒక పెద్ద క్రైమ్ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కలలు కనే యువత అమాయకత్వాన్ని, వారి నమ్మకాన్ని తమ వ్యాపారానికి ప్రధాన పెట్టుబడిగా మార్చుకున్నారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరాలతో పాటు లండన్‌లోనూ 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో ఆఫీసులు ప్రారంభించి తమ మోసాల వలను వేగంగా విస్తరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులను, అలాగే ఇప్పటికే యూకేలో ఉంటూ వీసా గడువు పొడిగించుకోవాలని చూస్తున్న వారిని వీరు టార్గెట్ చేశారు. యూకేలో వర్క్ వీసాలు, భారీ జీతాలతో కూడిన ఐటీ, టెక్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, అందుకు అవసరమైన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ఆశతో వచ్చి తమ దగ్గర వాలిన ప్రతీ ఒక్కరి నుంచి రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు పిండుకున్నారు.

    ఈ మోసం వెనుక వీరి ప్లానింగ్ చూసి పోలీసు అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రిటన్ చట్టాలలోని కొన్ని లొసుగులను వాడుకుని, అక్కడ 'క్లౌడ్ సర్వ్', 'ఆర్‌ఆర్జే టెక్' పేరుతో దాదాపు 8కి పైగా బోగస్ షెల్ కంపెనీలను సృష్టించారు. ఆ కంపెనీలకు ఎలాంటి ఆఫీసులు గానీ, వ్యాపారాలు గానీ ఉండవు. కేవలం కాగితాలకే పరిమితమైన ఆ కంపెనీల పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు తయారు చేసి బాధితులకు పంపేవారు. డబ్బులు చేతికి అందే వరకు అమాయకంగా మాట్లాడే ఈ దంపతులు... ఒక్కసారి లక్షల రూపాయలు తమ ఖాతాల్లో పడగానే అసలు రంగు బయటపెట్టేవారు. బాధితుల ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం, లండన్‌లో తమకున్న ప్రాబల్యంతో బెదిరింపులకు దిగడం చేసేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివ క్రాంతి కుమార్ అనే బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు. తాను కష్టపడి సంపాదించిన, అప్పులు చేసి తెచ్చి ఇచ్చిన లక్షలాది రూపాయలను ఈ దంపతులు ఎలా దోచుకున్నారో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశాడు. దీంతో మధుకర్ (A1), రమా నందన (A2), మోహన్ రావు (A3) లపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వార్త బయటకు రావడంతో బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి వివిధ జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. సుమారు 50 నుంచి 100 మంది వరకు నిరుద్యోగులు ఈ కిల్లాడీ జంట చేతిలో దారుణంగా మోసపోయారని, ఈ స్కామ్ విలువ రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది.

    పోలీసులు విచారణకు హాజరుకావాలని ఆదేశించినా ఈ దంపతులు స్పందించలేదు. విదేశాల్లో దాక్కుని పోలీసుల కంటికి కనిపించకుండా తప్పించుకు తిరిగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రంగా పరిగణించి, వారిపై వెంటనే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున లండన్ నుంచి వచ్చిన విమానంలో రమా నందన అలియాస్ నందు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టింది. ఇమిగ్రేషన్ తనిఖీల్లో లుకౌట్ నోటీసు ఆధారంగా అధికారులు ఆమెను అడ్డుకుని, వెంటనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.

    అరెస్ట్‌కు ముందే రమా నందన సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దబాయించే ప్రయత్నం చేసింది. తమ ఆడియోలను ఎడిట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడికి దిగింది. అయితే, బాధితులు సమర్పించిన బ్యాంకు లావాదేవీలు, ఫేక్ ఆఫర్ లెటర్ల ఆధారాలు ఈ జంట చుట్టూ ఉచ్చు బిగించాయి. యూట్యూబ్‌లో రోల్ మోడల్స్‌గా చెలామణి అయిన ఈ జంట... ఇప్పుడు కోట్లాది రూపాయల విదేశీ వీసా కుంభకోణంలో కటకటాల పాలవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలలోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    సామాజిక మాధ్యమాల్లో కనిపించే రంగుల ప్రపంచాన్ని నమ్మి, జీవితంలో పైకి రావాలనే ఆశతో కష్టపడి సంపాదించిన డబ్బులను విదేశీ కన్సల్టెన్సీలకు అప్పగిస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో ఈ 'నందూస్ వరల్డ్' ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. రమా నందన అరెస్ట్‌తో ఈ స్కామ్‌లో మొదటి అడుగు పడింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా పట్టుకుని, బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా, విదేశీ ఉద్యోగాల విషయంలో అధికారిక మార్గాలను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.