99TV News

    టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: అభివృద్ధి, సంపద సృష్టిపై సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం | AP ...

    టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: అభివృద్ధి, సంపద సృష్టిపై సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం | AP ...

    అమరావతి:

    రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీపీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన 'టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్'లో 'సుస్థిర అభివృద్ధి' అనే అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర స్థూల అభివృద్ధి (GSDP) నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానం కావాలని, అప్పుడే ప్రజల్లో సానుకూల దృక్పథం పెరుగుతుందని సీఎం వివరించారు.

    జీఎస్‌డీపీ పెంపు - ఉపాధి కల్పన

    2026-27 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 20.35 లక్షల కోట్లుగా నమోదైందని, దీనిని 15-20 రంగాల్లో మరింతగా పెంచేలా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కోరారు. "మన దగ్గరకు గూగుల్ వస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయి. డేటా సెంటర్లకు కావాల్సిన 5 టీఎంసీల నీరు ఒక సమస్యే కాదు. వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

    నదుల అనుసంధానం - జల సంరక్షణ

    రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాముఖ్యతను సీఎం నొక్కి చెప్పారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి 1,000 టీఎంసీల నీరు సముద్రం పాలైందని, ఇందులో 300 టీఎంసీలు వాడుకున్నా రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని అన్నారు.

    మూడేళ్లలో రూ. 35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.

    వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం.

    పోలవరం ఫేజ్-2 పూర్తయితే 190 టీఎంసీలు, బొల్లాపల్లి ప్రాజెక్టుతో 350 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర ప్రాజెక్టుల్లో 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం.

    మౌలిక వసతులు - సంపద సృష్టి

    దేశంలో 30 ఏళ్లలో ఊహించని మార్పులు వచ్చాయని, మన రాష్ట్రంలో అత్యంత సౌకర్యవంతమైన హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు నిర్మించుకుంటున్నామని సీఎం తెలిపారు. కుప్పం సమీపంలో జాతీయ రహదారికి దగ్గర్లో భారీ పారిశ్రామిక ప్రాంతాన్ని సృష్టించి ఇప్పటికే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. "సంపద సృష్టికి (Wealth Creation) డబ్బుల్లేవని కూర్చోకూడదు. సరైన ఆలోచన ఉంటే పరిష్కారం లభిస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.

    ఓటు బ్యాంక్ పెంపుపై వ్యూహం

    ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలని నాయకులకు సీఎం సూచించారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని, ఓటు వేసే అలవాటు లేని వారిని కూడా తమవైపు తిప్పుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

    నియోజకవర్గ స్థాయిలో జీఎస్‌డీపీ: రాష్ట్ర ప్రగతి నియోజకవర్గాల అభివృద్ధితో ముడిపడి ఉందని, విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట తదితర నియోజకవర్గాలు ఇందులో ముందున్నాయని వెల్లడి.

    భారీగా ఐటీ ఉపాధి: గూగుల్ వంటి డేటా సెంటర్ల రాకతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టీకరణ.

    నదుల అనుసంధానం: గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవడం, పెన్నా, కావేరి నదుల అనుసంధానంతో 1400 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే లక్ష్యం.

    సంపద సృష్టి (Wealth Creation): 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్‌' నినాదంతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం.