ఏపీకి సేవ చేయడానికి సిద్ధమన్న అనంత్ అంబానీ
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా రైతులను సీఈఓలుగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హామీ
ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రాష్ట్రాభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు. రైతుల ఆదాయవృద్ధి, టెక్నాలజీ వినియోగం, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులపై రిలయన్స్ ప్రణాళికలను ఆయన వివరించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అనంత్ అంబానీ మాట్లాడుతూ, “నన్ను మీ ఆంధ్రా బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయాలో, ఏ సేవ అందించాలో మీరే మార్గనిర్దేశం చేయండి” అన్నారు. రాయలసీమలో ఏర్పాటవుతున్న హార్టికల్చర్ హబ్ దేశ వ్యవసాయ రంగానికి కీలక వేదిక అవుతుందని చెప్పారు. “ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఉన్నత ప్రమాణాలతో ఎదుగుతుంది. ఈ సంస్థ ద్వారా అన్నదాతలను వారి కమతాలకే సీఈఓలుగా మారుస్తాం” అని ఆయన తెలిపారు.
HIGHLIGHTS
- ఏపీలో సీబీజీ ప్లాంట్లకు రూ.1 లక్ష కోట్ల ప్రణాళిక
- రైతులకు ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ సహకారం
- ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన
- అనంత్ ప్రసంగాన్ని చంద్రబాబు ప్రశంసించారు
టెక్నాలజీ ఆధారిత వ్యవసాయంపై అనంత్ అంబానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. “ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ ద్వారా ప్రెసిషన్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తాం. మదనపల్లె టమాటో రైతులు తమ ఉత్పత్తులను ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో చెప్పే వ్యవస్థను రూపొందిస్తాం” అని అన్నారు. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా రైతులను “ఊర్జాదాతలు”గా మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
అనంత్ ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. “దేశ్ సేవా-కిసాన్ సేవా మా నినాదం” అని అనంత్ అంబానీ పేర్కొన్నారు. ప్రాజెక్టుల అమలు విధానం, రైతులకు అందించే టెక్నాలజీ సేవలపై ప్రభుత్వం, రిలయన్స్ తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నాయి.
