ఏపీలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు
గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం నగరాలకు కమిషనర్ వ్యవస్థ; రాష్ట్రంలో కమిషనరేట్ల సంఖ్య 6కు పెరుగుదల
ఆంధ్రప్రదేశ్లో పోలీసు పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం నగరాలు ఇకపై పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలోకి రానున్నాయి.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిషనరేట్లకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 14(6) కింద వీరికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, పోలీసు జిల్లాల సరిహద్దులనే కమిషనరేట్ల పరిధిగా నిర్ణయించారు.
కొత్తగా పోస్టులు సృష్టించకుండా, ప్రస్తుతం వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్ పోస్టులను సర్దుబాటు చేశారు. తిరుపతి కమిషనర్ పోస్టుకు విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పోస్టును, గుంటూరు కమిషనర్ పోస్టుకు శిక్షణ విభాగం డీఐజీ పోస్టును కేటాయించారు. రాజమహేంద్రవరం, కర్నూలు కమిషనర్ పోస్టులనూ ఇతర విభాగాల నుంచి బదలాయించారు.
HIGHLIGHTS
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు
- మొత్తం కమిషనరేట్ల సంఖ్య 6కు చేరిక
- ఐజీ లేదా డీఐజీ స్థాయి కమిషనర్లు
- కొత్త పోస్టులు సృష్టించని ప్రభుత్వం
తిరుపతి కమిషనరేట్ పరిధిలో తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లు ఉంటాయి. భక్తుల రద్దీ, ట్రాఫిక్, వీఐపీ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గుంటూరు కమిషనరేట్ పరిధిలో గుంటూరు, అమరావతి, తెనాలి జోన్లు ఉంటాయి. రాజమహేంద్రవరం, కర్నూలు కమిషనరేట్ల పరిధిలో ఆయా నగరాలతో పాటు పరిసర ప్రాంతాలు చేరనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కమిషనరేట్ల సంఖ్య 6కు చేరింది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త కమిషనరేట్లకు అవసరమైన డీసీపీలు, ఏసీపీలు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టనుంది.
