బెంగళూరులోని ఓ పబ్‌లో జరిగిన వివాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడి చేసి బెదిరించారనే ఆరోపణలపై ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు మరో ముగ్గురిపై బెంగళూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలు ఏం జరిగింది?
వివరాల ప్రకారం.. అక్టోబర్ 10 తెల్లవారుజామున బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పబ్‌లు, బార్లలో తనిఖీలు చేపట్టారు. అక్కడికి వచ్చే వారి గుర్తింపు కార్డులను పరిశీలించడంతో పాటు వయసును ధ్రువీకరిస్తున్నారు.
ఈ క్రమంలో పబ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను దూషించడంతో పాటు వారిపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి.
ఐఏఎస్ అధికారి సహా నలుగురిపై కేసు
ఈ ఘటనకు సంబంధించి పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఫిర్యాదు చేశారు. దీంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్‌పై కేసు నమోదు చేశారు.
వికాస్ మర్మత్ 2019 బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఏయే ఆరోపణలు ఉన్నాయి?
ఫిర్యాదు ప్రకారం.. పోలీసుల తనిఖీల సమయంలో నలుగురు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను దూషించడం, దాడి చేయడం, బెదిరించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
