99TV News

    ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 కీలకం

    ఏపీలో పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ.. పాలసీల స్థిరత్వానికి కొత్త యాక్ట్

    ఏపీలో పెట్టుబడులకు చట్టపరమైన రక్షణకు ముసాయిదా సిద్ధం

    ప్రభుత్వాలు మారినా పాలసీలు మారవని పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా కొత్త చట్టానికి ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది

    ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు శాశ్వత భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026’ ముసాయిదాను సిద్ధం చేసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారులు ఈ ప్రతిపాదనపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

    ఈ చట్టం ద్వారా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, అనుమతులు, నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు, ఎస్క్రో చెల్లింపులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం భాగస్వామ్య సదస్సులో ఇచ్చిన హామీ మేరకు ముసాయిదా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. “ప్రభుత్వాలు మారినా పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రద్దు కాకుండా కఠిన చట్టం తీసుకువస్తాం” అని చంద్రబాబు ఆ సదస్సులో చెప్పారు.

    HIGHLIGHTS

    - ఏప్రిల్ 1 నుంచి అమలు లక్ష్యం

    - డిసెంబర్‌లో పబ్లిక్ డొమైన్‌లో ముసాయిదా

    - ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదం ప్రయత్నం

    వివాదాల పరిష్కారానికి రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల శాఖ ముసాయిదాను ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రజాభిప్రాయానికి ఉంచి, జనవరిలో తుది రూపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.