ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుణేఠా బుధవారం విజయవాడలో ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
తొలి విడతలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు కలిపి 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 28న పోలింగ్ చేపడతారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.
రెండో విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఫలితాలు ప్రకటించనున్నారు. గ్రామ పంచాయతీలకు నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
