99TV News

    AP DSC 2025 వివాదం: స్పోర్ట్స్ కోటా, TET అర్హతలపై ఆరోపణలు.. ప్రభుత్వం ఏమంటోంది?

    ఏపీ డీఎస్సీ పై వివాదం -ఆరోపణలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం

    గత కొన్నాళ్లుగా ఏపీలో డీఎస్సీ వ్యవహారం దుమారం రేపుతోంది. నష్టపోయిన ప్రతిభావంతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా కుమిలిపోయిన బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డీఎస్సీ ముసుగులో సర్కారు నిర్వాకాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏకంగా మతం, కులం మార్చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తేలడం నివ్వెరపరుస్తోంది. టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో.. డీఎస్సీ కుంభకోణం బద్దలవుతోంది. వరుస అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు తేలింది. టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం పొందిన చిల్లా యోగీశ్వరరావు.. అతని చెల్లి మోహిని దేవికి కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ వచ్చింది. టెట్ సెర్టిఫికెట్ పెట్టకపోయినా యోగీశ్వరరావుకి ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చేశారు. టెట్ అర్హత రావాలంటే 75 మార్కులు రావాలి.. మూడుసార్లు టెట్ రాసినా 75 మార్కులు రాలేదు. అయినా ఉద్యోగం వచ్చేసింది.

    స్పోర్ట్స్ కోటాలో మరో టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్‌ తెలుగు ఉద్యోగం కట్టబెట్టారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. జంపాల ఉషా అనే మహిళకు ఎస్‌ఏ తెలుగు ఉద్యోగం ఇచ్చినట్లు తేలింది. స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ దక్కించుకున్న ఉషా.. తెలుగు టెట్ పాస్ కాలేదు. దరఖాస్తులో ఎస్ ఏ బయాలజీగా ఉషా పేర్కొంది. సెలక్షన్ లిస్ట్‌లో ఎస్‌ఏ తెలుగు ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చేసింది.

    కాగా, స్పోర్ట్స్‌ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఇప్పుడు వైసీపీ గగ్గోలు పెడుతోంది .

    డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు :-

    ⇒ స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్‌ జాబితాను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు?

    ⇒ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారు? వారి బాధ్యతను ప్రభుత్వం వెల్లడిస్తుందా?

    ⇒ ఫేక్‌/అనుమానాస్పద సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఒకే స్థాయి విచారణ జరిగిందా? లేక కేసు కేసుకు వేర్వేరు ప్రమాణాలు పాటించారా?

    ⇒ అనర్హత నిర్ధారణ అయిన అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఆ నియామకాలను రద్దు చేస్తారా? వారికి చెల్లించిన వేతనాల పరిస్థితి ఏమిటి?

    ⇒ అక్రమంగా పోస్టు కోల్పోయినట్లు చెబుతున్న మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి?

    ⇒ మొత్తం స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో ఎన్ని సర్టిఫికెట్లను, ఎంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఆడిట్‌ చేశారు?

    ⇒ గుర్తింపు రద్దయిన లేదా గుర్తింపు లేని స్పోర్ట్స్‌ సంఘాల సర్టిఫికెట్లను డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఏ నిబంధన ప్రకారం అంగీకరించారు?

    ⇒ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌కు గుర్తింపు లేకపోయినా ఆ సంఘం జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?

    కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ టీచర్ పోస్ట్ ఇచ్చారనే వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి కూడా విచారణ జరపారని.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్నూలు టీచర్ అంశంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. దరఖాస్తు దశలోనే తిరస్కరణకు గురికావాల్సిన వ్యక్తికి ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మెగా డీఎస్సీలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నా కూడా..ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని జగన్ విమర్శించారు. సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని.. ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చేత రాజీనామా చేయించకుండా.. అబద్ధాలుచెప్తూ, పబ్లిసిటీ చేస్తూ చంద్రబాబు తన కుమారుణ్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు.

    కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉందని.. అయితే 65 మార్కులే వచ్చినప్పటికీ అతనికి స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. ఒన్‌-టు-ఒన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారని వైఎస్ జగన్ నిలదీశారు. దరఖాస్తు దశలోనే రిజెక్ట్‌ కావాల్సిన వ్యక్తి, ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న వైఎస్ జగన్.. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయించాలని మరోసారి డిమాండ్ చేశారు. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నామని తెలిపారు.

    డీఎస్సీపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. దీనిపై లోకేష్ ప్రత్యేకంగా ఓ వీడియో ఎక్స్ వేదికగా విడుదల చేశారు. డీఎస్సీ నిర్వహణ, పోస్టుల భర్తీ, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో వినిపించారు. గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని వివరించారు. ఈ విషయంలో కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2029 నాటికి మరో మూడు డీఎస్సీలు నిర్వహించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    ప్రభుత్వం & అధికారుల స్పందన :- .

    ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలపై గత పది రోజులుగా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. స్పోర్ట్స్ కోటా సహా ఇతర నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేసింది. అమరావతిలోని విద్యాభవన్ లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ భరణి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు.

    స్పోర్ట్స్ కోటా ఎంపికలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగాయని శాప్ ఎండీ భరణి తెలిపారు. తుది జాబితాకు ముందు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించామని, ఆ సమయంలో జూడో సర్టిఫికెట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వివరించారు.

    కొందరు క్రీడాకారులపై వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు ఖండించారు. జాతీయ స్థాయి బాక్సర్ పెద్ద అప్పల రాజు విషయంలో ఆన్‌లైన్‌లో పొరపాటున సోదరుడి సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసినా, తర్వాత సరిదిద్దుకున్నారని.. ఆయన పత్రాలన్నీ నిజమైనవేనని వీడియో ఫుటేజ్‌తో సహా నిర్ధారించుకున్నామని తెలిపారు. అలాగే, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేయడంపై మాట్లాడుతూ.. జాతీయ సమాఖ్య అధికారికంగా అనుమతి ఇచ్చినందునే ఆయన సంతకం చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు.

    టెట్ అర్హత మార్కుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా వివరణ ఇచ్చారు. కర్నూలుకు చెందిన అభ్యర్థి ప్రభాకర్ టెట్‌లో 77 మార్కులు సాధించి అర్హత పొందారని, దీనిపై మరింత స్పష్టత కోసం సెప్టెంబర్ 5న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

    అదేవిధంగా, జంపాల ఉష 2012లోనే టెట్‌లో 80 మార్కులతో అర్హత సాధించారని, అప్పట్లో లాంగ్వేజ్ పండిట్లకు ప్రత్యేక టెట్ లేదని, ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. మిగిలిన అభ్యర్థుల అర్హతలు కూడా నిబంధనల ప్రకారమే ఉన్నాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ పరిధిలోని అంశమని, అనుమానం ఉన్న సర్టిఫికెట్లను పునఃపరిశీలన కోసం జిల్లా కలెక్టర్లకు పంపామని తెలిపారు.