99TV News

    ఏపీ 12వ పీఆర్సీ గైడ్‌లైన్స్ విడుదల | డెడ్‌లైన్ డిసెంబర్ 31

    ఏపీ ఉద్యోగులకు అలర్ట్: 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల, డిసెంబర్ 31 డెడ్‌లైన్

    ఏపీ ఉద్యోగుల 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల

    డీఏ విలీనం, కొత్త పే స్కేళ్లు, పెన్షన్ విధానం, అలవెన్సులపై సూచనలకు డిసెంబర్ 31 వరకు గడువు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల 12వ వేతన సవరణ కమిషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు తమ సూచనలు, అభ్యంతరాలను డిసెంబర్ 31లోగా సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది.

    ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలను కమిషన్ పరిశీలించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డీఏను మూలవేతనంలో ఎంతవరకు విలీనం చేయాలి, కొత్త పే స్కేళ్లు ఎలా ఉండాలి, స్పెషల్ పే, ఇతర అలవెన్సుల చెల్లింపు విధానం ఎలా మారాలి అన్న అంశాలపై అధ్యయనం జరగనుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమల్లో ఎదురవుతున్న సమస్యలను కూడా కమిషన్ పరిశీలించి, కొనసాగింపు లేదా మార్పులపై సిఫారసులు చేయనుంది.

    యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు, జాతీయ న్యాయ వేతన సంఘం పరిధిలోకి వచ్చే న్యాయాధికారులు ఈ పీఆర్సీ పరిధిలోకి రారని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షనర్ల ప్రస్తుత పింఛను విధానాన్ని కూడా కమిషన్ సమీక్షించనుంది. పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చడం, కాంట్రాక్ట్, డిప్యుటేషన్ నిబంధనలు, శాఖలవారీ మానవ వనరుల అవసరాలను పరిగణనలోకి తీసుకోనుంది.

    HIGHLIGHTS

    - సూచనలకు డిసెంబర్ 31 చివరి గడువు

    - డీఏ విలీనంపై కమిషన్ ప్రత్యేక అధ్యయనం

    - అధ్యాపకులు, న్యాయాధికారులకు పీఆర్సీ మినహాయింపు

    - రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా సిఫారసులు

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తుది సిఫారసులు రూపొందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులతో పీఆర్సీ కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. డిసెంబర్ 31 తర్వాత అభ్యంతరాల పరిశీలన, కమిషన్ సిఫారసుల ఖరారు ప్రక్రియ తదుపరి కీలక దశగా ఉండనుంది.