ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో 77.65 శాతం సగటు పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను విడుదల చేసింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 58.85 శాతం పోలింగ్ నమోదైంది.
709 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 నవంబర్ 13న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడతలో మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలకు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన తర్వాత 760 సర్పంచ్ స్థానాలు, 14,731 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే మొత్తం 709 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 44 వార్డుల్లో అసలు నామినేషన్లు దాఖలు కాలేదు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్
మిగిలిన స్థానాలకు నవంబర్ 26, 2026న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 3,189 సర్పంచ్ స్థానాలకు, 25,057 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 77.65 శాతం పోలింగ్ నమోదైంది.
చిత్తూరులో అత్యధికం.. అల్లూరిలో అత్యల్పం
జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లా 83.37 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా 83.33 శాతంతో రెండో స్థానంలో ఉంది. నంద్యాలలో 82.68 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 82.05 శాతం, అనంతపురంలో 81.23 శాతం పోలింగ్ నమోదైంది.
మార్కాపురంలో 81.70 శాతం, అనకాపల్లిలో 81.59 శాతం, పల్నాడులో 80.52 శాతం, ప్రకాశంలో 80.27 శాతం, ఏలూరులో 80.23 శాతం పోలింగ్ నమోదైంది.
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 58.85 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళంలో 66.93 శాతం, తిరుపతిలో 73.60 శాతం, వైఎస్ఆర్ కడపలో 74.87 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 75.83 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతాలు ఇవే..
జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 66.93%
పార్వతీపురం మన్యం 78.78%
విజయనగరం 83.33%
అనకాపల్లి 81.59%
అల్లూరి సీతారామరాజు 58.85%
పోలవరం 71.21%
కాకినాడ 78.79%
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ 72.60%
తూర్పు గోదావరి 78.47%
పశ్చిమ గోదావరి 76.42%
ఏలూరు 80.23%
కృష్ణా 79.77%
ఎన్టీఆర్ 75.83%
పల్నాడు 80.52%
బాపట్ల 79.84%
ప్రకాశం 80.27%
మార్కాపురం 81.70%
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80.60%
తిరుపతి 73.60%
చిత్తూరు 83.37%
అన్నమయ్య 78.66%
వైఎస్ఆర్ కడప 74.87%
అనంతపురం 81.23%
శ్రీ సత్యసాయి 82.05%
కర్నూలు 76.60%
నంద్యాల 82.68%
విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు లేవు
విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
