ఏపీ పల్లెపోరులో వింతలు.. విశేషాలు
ఏపీ పల్లెపోరులో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయ పోరుతోపాటు ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు వేదికయ్యాయి. ఒకచోట తండ్రి వైసీపీ నుంచి గెలిస్తే.. కూతురు టీడీపీ నుంచి విజయం సాధించింది. మరోచోట అక్కపై చెల్లెలు గెలిచింది. ఇంకోచోట ఒక్క ఓటే అభ్యర్థి రాజకీయ భవిష్యత్తును మార్చేసింది. మరికొన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా అందని విజయం ఈసారి దక్కింది. ఆసక్తికరమైన ఈ ఎన్నికల విశేషాలపై ప్రత్యేక కథనం.
తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఇద్దరికీ విజయం దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పొనుగుపాటి సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన కుమార్తె పొనుగుపాటి చాందిని కొత్తపేట-2 స్థానం నుంచి టీడీపీ మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కొత్తపేట మండలంలో వైసీపీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి సత్యనారాయణ కావడం విశేషం.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మరో తండ్రీకూతుళ్ల జంట విజయాన్ని అందుకుంది. తండ్రి జి. యుగంధర్ పాంచాలి ఎంపీటీసీ స్థానం నుంచి, కుమార్తె కావ్య మాతుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కోనసీమలో తండ్రి, కూతురు వేర్వేరు పార్టీల నుంచి గెలిస్తే.. ఇక్కడ ఒకే పార్టీ తరఫున ఇద్దరూ విజయం సాధించడం విశేషం.
అన్నమయ్య జిల్లాలోని కొండయ్యగారిపల్లి ఎంపీటీసీ స్థానంలో అక్కాచెల్లెళ్ల మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగింది. వైసీపీ తరఫున పోటీ చేసిన చెల్లెలు కె. లక్ష్మమ్మ తన సొంత అక్క కె. శాంతమ్మపై విజయం సాధించారు. కేవలం 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈ పోరులో ప్రత్యేకత. కుటుంబంలోనే ఇద్దరు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలవడంతో గ్రామంలో ఈ పోటీ ఆసక్తి రేపింది.
ఒక్క ఓటు.. ఇద్దరు అరుణలకూ విజయాన్ని అందించింది. ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంత కీలకమో నిరూపించే ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మనపట్నంలో టీడీపీ అభ్యర్థి అరుణ తన ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఇదే తరహాలో పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో మరో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి కూడా ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు. ఇద్దరి పేర్లలోనూ అరుణ ఉండటం మరో విశేషం. ఒక్క ఓటు తేడాతో ఫలితం తేలడంతో ఓడిపోయిన అభ్యర్థుల తరఫున కౌంటింగ్ కేంద్రంలో నిరసన కూడా వ్యక్తమైంది.
జగన్ మేనత్త స్వగ్రామంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలుపు సాధించింది. ఎన్టీఆర్ జిల్లా గణపవరం గ్రామంలో మరో ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మేనత్త వైఎస్ విమలమ్మ స్వగ్రామం ఈ గణపవరం. ఈ గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకోవడం విశేషం.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో తోడికోడళ్ల మధ్య ఎంపీటీసీ ఎన్నికల పోటీ జరిగింది. వైసీపీ, జనసేన తరఫున ఇద్దరు తోడికోడళ్లు పోటీకి దిగారు. చివరకు జనసేన అభ్యర్థి బోడపాటి మంగాదేవి తన ప్రత్యర్థి బోడపాటి సుప్రియపైన విజయం సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయడం మరో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.
