అమరావతి:
రాష్ట్రంలో 'అర్నబ్' తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం రోజున అర్నబ్ తుపాను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ యంత్రాంగాన్ని సంపూర్ణంగా అప్రమత్తం చేశారు.
బుడమేరు, ఏలేరుపై ప్రత్యేక దృష్టి
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, బుడమేరు వాగుతో పాటు ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. బుడమేరు వాగులో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే బుడమేరు రక్షణకు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై తక్షణమే పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Also Read - రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీట్ల సర్దుబాటు.. కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
వరద అంచనాలు - ముందస్తు మేనేజ్‌మెంట్
తుపాను వర్షాల వల్ల ఏలేరు రిజర్వాయర్‌కు వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ (వాటర్ మేనేజ్‌మెంట్) చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అంతేకాకుండా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నదులకు వచ్చే వరదను కూడా ముందస్తుగా అంచనా వేస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తుపాను వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జల వనరుల శాఖ పరంగా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తిలతో పాటు వివిధ జిల్లాల సీఈలు పాల్గొన్నారు.
