ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు.ప్రధాని మోదీ తో జరిగిన భేటీ లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.గోదావరి–కావేరి నదుల అనుసంధానం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. దేశంలో రహదారుల నెట్‌వర్క్, పవర్‌గ్రిడ్ తరహాలో భవిష్యత్తులో ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటుకు నదుల అనుసంధానం దోహదపడుతుందని ప్రధానికి వివరించారు.ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి, నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు.2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉందని వివరించారు.
ఎల్‌నినోతో 53 శాతం లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తక్కువ వర్షపాతం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపిందని, కరువు పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను కూడా ప్రధానికి వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని తెలిపారు.రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతిలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు తదితర ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చించారు.విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి మంజూరు చేయాలని కోరడంతో పాటు బీచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2047 నాటికి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌ను కూడా చంద్రబాబు వివరించారు.
