99TV News

    బాలినేని జనసేనలోనేనా? ప్రచారంపై పార్టీ క్లారిటీ

    బాలినేని జనసేనను వీడుతున్నారా? వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారంపై క్లారిటీ

    వైఎస్ జగన్ కు సమీప బంధువు, వైసీపీలో మంత్రిగా, కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ అధికారం కోల్పోయాక జనసేనలోకి వెళ్లిపోయారు. అక్కడే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. గత కొంతకాలంగా జనసేన కార్యక్రమాల్లో బాలినేని కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో బాలినేని బెంగళూరు వెళ్లి తన మాజీ బాస్ వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జనసేన ఎట్టకేలకు స్పందించింది.

    బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద జరుగుతున్న అబద్ధపు, విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ టిడ్కో ఛైర్మన్, జనసేన సంక్షోభ నిర్వహణ కమిటీ నేత అజయ్ కుమార్ తెలిపారు. బాలినేని జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. బాలినేని జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైసీపీ కొవర్ట్ అని మరొకరు, ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని బెంగుళూరులో జగన ను కలిసినట్టు, తిరిగి వైసీపీ లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారం మొదలుపెట్టారని తెలిపారు. ఈ ప్రచారం ఒక రాజకీయ పక్షానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసే చానల్స్ చేస్తున్నాయని సులభంగా అర్ధమవుతోందన్నారు.

    బాలినేని జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదని అజయ్ కుమార్ తేల్చేశారు. ఈ మాట తాను చాలా భాద్యతతో మాట్లాడుతున్నానని తెలిపారు. బాలినేని రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడని, అలాంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరమని ఎంతో మక్కువతో స్వయానా పవన్ కళ్యాణ్ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారన్నారు. బాలినేనికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం, ఇష్టం కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని అన్నారు. అలాగే జనసేన కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, నిబ్బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని అన్నారు. అందుకే అటు విపక్షాలు, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయన్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయమన్నారు.

    ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం జనసేనలో బాలినేని పాత్రపై జరుగుతున్న చర్చ. స్థానిక ఎన్నికల వ్యూహానికి పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీలో బాలినేనికి చోటు దక్కకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒంగోలులో బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య ఉన్న రాజకీయ పోటీ కూడా మరో కీలక అంశంగా ఉంది. అనుకూల మీడియాతో దామచర్ల వర్గమే బాలినేని మీద ఇలాంటి విష ప్రచారాలు చేయిస్తోందని బాలినేని అనుచరులు అంటున్నారు. ఈ నేపథ్యంతో జనసేనలో బాలినేని భవిష్యత్‌పై ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి.

    .

    బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నేత జనసేనలో కొనసాగడం.... ఒంగోలు, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం పార్టీకి ఉపయోగపడే అంశంగా ఉంటుంది. వైసీపీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు స్థానిక రాజకీయాలపై ఆయనకు ఉన్న పరిచయాలు జనసేనకు అదనపు రాజకీయ నెట్‌వర్క్‌ను అందించగలవు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం అవసరమైన సమయంలో బాలినేని లాంటి నేతల అనుభవం పార్టీకి కీలకంగా మారొచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు ఎలాంటి రాజకీయ బాధ్యతలు ఇస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. బాలినేని జనసేనలో కొనసాగితే ప్రకాశం జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు ఆయన మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆయనతో పాటు స్థానికంగా ఉన్న జనసేన నాయకత్వంతో సమన్వయం ఎలా ఉంటుంది అన్నది కూడా ముఖ్యమే. ముఖ్యంగా సీనియర్ నేతలు, అనుభవజ్ఞులు జనసేనలోకి రావడం వల్ల పార్టీకి వివిధ జిల్లాల్లో కొత్త రాజకీయ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే నాయకుల చేరికతో పాటు వారికి సరైన బాధ్యతలు, స్థానిక క్యాడర్‌తో సమన్వయం, క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం కూడా పార్టీ బలానికి అవసరమైన అంశాలే. బాలినేని విషయంలో కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఆయన పార్టీ మారుతారా అన్నదానికంటే జనసేనలో ఆయనకు ఎలాంటి పాత్ర లభిస్తుంది అన్నదే. జనసేన నాయకత్వం ఆయన అనుభవాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది.