ఎన్నికల బరిలో అభ్యర్థికి ఒక్కటే ఓటు!
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనది. ఒక్క ఓటుతో అభ్యర్థులు గెలిచిన సందర్భాలున్నాయి. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే రావడం చర్చనీయాంశమైంది. గతంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఆ ఆసక్తికర విశేషాలేంటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చడా సువర్ణకు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అదే స్థానంలో టీడీపీ అభ్యర్థి స్రవంతికి 1,508 ఓట్లు, వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బమ్మకు 1,037 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి 471 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోటాకు కూడా 27 ఓట్లు రావడం విశేషం. సువర్ణకు వచ్చిన ఒక్క ఓటు ఎవరు వేశారన్నది తెలియరాలేదు. ఆ ఓటు ఆమెదేనా? మరెవరైనా వేశారా? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
గతంలో గుజరాత్ లోనూ ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2021 డిసెంబర్‌లో గుజరాత్‌లోని వాపీ ప్రాంతం ఛార్వాలా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సంతోష్ అనే అభ్యర్థి పోటీ చేశారు. ఆయన కుటుంబంలో మొత్తం 12 మంది ఓటర్లు ఉన్నారు. తన కుటుంబ సభ్యులంతా తనకు ఓటు వేస్తారని ఆయన ఆశించారు. కానీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు వచ్చింది ఒక్క ఓటు మాత్రమే. ఆ ఒక్క ఓటు కూడా తనదేనని తెలిసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
2021 అక్టోబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కురుడంపాళయం పంచాయతీ తొమ్మిదో వార్డు సభ్యుడి స్థానానికి బీజేపీ యువజన విభాగం నాయకుడు డి. కార్తీక్ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో ఆయనకు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఆయన కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉండటంతో మిగిలిన నలుగురూ ఎక్కడికి వెళ్లారనే చర్చ మొదలైంది. దీనిపై కార్తీక్ స్వయంగా వివరణ ఇచ్చారు. తన కుటుంబ సభ్యుల ఓట్లు నాలుగో వార్డులో ఉండగా, తాను తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేశానని చెప్పారు. అందువల్ల కుటుంబ సభ్యులు తనకు ఓటు వేసే అవకాశం లేదని అన్నారు. ఈ ఘటన పైన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ సాగింది.
