అమరావతి:
తాము రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని వైకాపా సహించలేకపోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఆ పార్టీకి ఎంతమాత్రం ఇష్టం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగకూడదనే దురుద్దేశంతో విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లతో కలిసి ఆయన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పని
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే వైకాపా సహించలేకపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. "ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయి, అభివృద్ధి నిలిచిపోతుంది. అబద్ధాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుంది. జగన్ రెండు రోజులు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పి బెంగళూరు వెళ్తారు. మాకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ముఖ్యమైతే.. వైకాపాకు కావాల్సింది కేవలం విధ్వంసమే" అని మండిపడ్డారు.
Also Read - స్థా నిక ఎన్నికల్లోనూ కూటమి ఐక్యత చాటాలి.. ఎన్డీఏ నేతల పిలుపు
ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కావాలి
స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం, ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని, ప్రజలు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌ను అందించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో విద్యావంతులు, యువత, నీతి నిజాయతీ గలవారికి అభ్యర్థులుగా అవకాశం కల్పించామని, కూటమి బి-ఫామ్ ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
'అర్నబ్' తుపానుపై యంత్రాంగం అప్రమత్తం
రాష్ట్రంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను ముప్పుపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని చంద్రబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించినట్లు చెప్పారు. గంటకు 135 నుంచి 145 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగమంతా సిద్ధంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు.
