అమరావతి:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపానుగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేసి హైఅలర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి వంగలపూడి అనిత పలు కీలక సూచనలు చేశారు. రాబోయే నాలుగు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
48 గంటల పాటు ప్రయాణాలు వద్దు!
వాతావరణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందనే భ్రమలతో ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని హోంమంత్రి సూచించారు. "అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప రాబోయే 48 గంటల పాటు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దు" అని కోరారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రాణరక్షణే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు - ముందస్తు చర్యలు
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు మరియు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేందుకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన వారు సమీప తీరాలకు తిరిగి రావాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు.
వదంతులు నమ్మవద్దు
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, వదంతులను ప్రజలు నమ్మవద్దని మంత్రి అనిత హితవు పలికారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), RTGS అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
(అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు: 1070, 112)
