ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను ప్రభావం పలు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలంలో తుపాను ప్రభావంతో రెండు వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాడిగూడ వద్ద కొట్టుకుపోయిన వంతెన
అనంతగిరి మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలో ఉన్న తాడిగూడ గ్రామంలో అర్నబ్ తుపాను కారణంగా తీవ్ర గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాల ధాటికి గ్రామానికి సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. దీంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వంతెన దెబ్బతినడంతో అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన గ్రామస్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి తాత్కాలికంగా రాకపోకలు పునరుద్ధరించడంతో పాటు, శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
శివలింగపురం–కృష్ణాపురం మధ్య మరో వంతెన ధ్వంసం
అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం–కృష్ణాపురం గ్రామాల మధ్య ఉన్న వంతెన కూడా తుపాను ప్రభావానికి దెబ్బతిన్నట్లు సమాచారం. భారీ వర్షాలతో గెడ్డ పొంగిపొర్లడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు రాకపోకల సమస్య ఏర్పడింది.
వరద ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న వంతెనల వద్ద ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైలైట్స్:
అల్లూరి జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావం
అనంతగిరి మండలంలో కొట్టుకుపోయిన రెండు వంతెనలు
తాడిగూడ గ్రామంలో రాకపోకలకు అంతరాయం
శివలింగపురం–కృష్ణాపురం మధ్య వంతెన ధ్వంసం
కాశీపట్నం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోస్తని నది
శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
కాశీపట్నం వద్ద ఉద్ధృతంగా గోస్తని నది
మరోవైపు అనంతగిరి మండలంలోని కాశీపట్నం వద్ద గోస్తని నది తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నదులు, వాగులు, గెడ్డల వద్దకు వెళ్లకుండా ఉండటం, వరద నీరు ప్రవహించే మార్గాలను దాటేందుకు ప్రయత్నించకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అధికారులు సూచించే హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలి.
శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
వంతెనలు కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలను అధికారులు పరిశీలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read- కోనసీమలో తుపాను విధ్వంసం.. పంటలకు దెబ్బ, విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం
