99TV News

    Guntur ZPTC MPTC Elections | 1,176 నామినేషన్లు దాఖలు

    Guntur ZPTC MPTC Elections | 1,176 నామినేషన్లు దాఖలు

    గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పల్లె పాలనలో భాగస్వాములు కావాలనే ఆశతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 13 జడ్పీటీసీ స్థానాలకు 103 నామినేషన్లు, 200 ఎంపీటీసీ స్థానాలకు 1,073 నామినేషన్లు వచ్చాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు, పార్టీ టికెట్ల కేటాయింపుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

    జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. పలువురు నేతలు ఈ పదవిని ఆశిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీపడుతుండటంతో బీ-ఫారం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఎంపీపీ పదవులను ఆశిస్తున్నవారు సైతం ఎమ్మెల్యేలు, జిల్లా నేతల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

    జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఉత్కంఠ

    జిల్లాలో మొత్తం 13 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఛైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తూ వట్టిచెరుకూరు జడ్పీటీసీ స్థానం నుంచి గొరికపూడి సాత్విక, దారా అరుణ టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. పెదనందిపాడు నుంచి రావెల నాగసౌజన్య కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు.

    శుక్రవారం చివరి రోజు అనూహ్యంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నక్కల శైలజ కాకుమాను జడ్పీటీసీ స్థానం నుంచి నామినేషన్‌ వేశారు. నామినేషన్ల గడువు ముగియడానికి గంట ముందు జడ్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమె, రిటర్నింగ్‌ అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవకు నామపత్రాలు అందజేశారు. ఆమె భర్త, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ నక్కల అగస్టీన్‌, పెదనందిపాడు బ్రాంచి కాలువ డీసీ ఛైర్మన్‌ మండవ శ్రీనివాసరావు ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.

    బీ-ఫారం ఎవరికి దక్కుతుందో?

    జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవికి తొలుత నక్కల శైలజ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తర్వాత ఆమె రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సాత్విక, అరుణ గురువారమే నామినేషన్లు వేయగా, శుక్రవారం శైలజ సైతం బరిలోకి దిగారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.

    కాకుమాను జడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించడంతో టీడీపీ తరఫున దొప్పలపూడి కోటేశ్వరరావు కూడా నామినేషన్‌ వేశారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవడానికి ఇద్దరు అభ్యర్థులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఛైర్‌పర్సన్‌ పదవిపై స్పష్టత వచ్చిన తర్వాతే వట్టిచెరుకూరు, కాకుమాను స్థానాల్లో టీడీపీ బీ-ఫారం ఎవరికి ఇవ్వాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    మరోవైపు, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తికాలేదు. ఒక్కో మండలంలో ఇద్దరు ఆశావహులు ఉండటంతో చర్చలు కొనసాగుతున్నాయి. శని, ఆదివారాల్లో నేతలు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగియనుంది.

    13 జడ్పీటీసీ స్థానాలకు 103 నామినేషన్లు

    జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఒక్కరోజే 66 నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజుల్లో మొత్తం 103 నామినేషన్లు నమోదయ్యాయి.

    పార్టీ నామినేషన్లు

    టీడీపీ 34

    జనసేన 17

    వైకాపా 34

    బీజేపీ 4

    కాంగ్రెస్‌ 6

    బీఎస్పీ 2

    ఇతర పార్టీలు 2

    స్వతంత్రులు 4

    మొత్తం 103

    టీడీపీ, వైకాపా చెరో 34 నామినేషన్లతో ముందున్నాయి. జనసేన నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

    200 ఎంపీటీసీ స్థానాలకు 1,073 నామినేషన్లు

    ఎంపీటీసీ స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 503 నామపత్రాలు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో మొత్తం 1,073 నామినేషన్లు నమోదయ్యాయి.

    పార్టీ నామినేషన్లు

    టీడీపీ 423

    జనసేన 105

    వైకాపా 472

    బీజేపీ 11

    కాంగ్రెస్‌ 9

    సీపీఎం 3

    బీఎస్పీ 2

    ఇతర పార్టీలు 1

    స్వతంత్రులు 47

    మొత్తం 1,073

    ఎంపీటీసీ నామినేషన్లలో వైకాపా 472తో ముందుండగా, టీడీపీ 423 నామినేషన్లతో తర్వాతి స్థానంలో ఉంది. జనసేన నుంచి 105, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 47 నామినేషన్లు వచ్చాయి.

    మూడు రోజులు.. మూడు పార్టీల పేర్లతో నామినేషన్‌!

    పెదనందిపాడు మండలం అన్నపర్రు ఎంపీటీసీ స్థానానికి పల్లెపాగ పాపారావు దాఖలు చేసిన నామినేషన్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. మొదటి రోజు వైకాపా అభ్యర్థిగా, రెండో రోజు స్వతంత్ర అభ్యర్థిగా, మూడో రోజు టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

    చివరకు ఆయన ఏ అభ్యర్థిగా బరిలో కొనసాగుతారన్నది ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది పోటీపై స్పష్టత రానుంది.

    Also Read - గుంటూరు అభివృద్ధికి కొత్త పాలకవర్గం ఏం చేయాలి? తాగునీరు, డ్రైనేజీ, రహదారులే కీలకం

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →