కడపలో కూటమి పార్టీల మధ్యే పోరు.. కమలం, గ్లాస్ ఢీ!
కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కూటమిలో భాగస్వాములైన భాజపా, జనసేన పార్టీల అభ్యర్థులే కొన్ని డివిజన్లలో పరస్పరం పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 14వ, 6వ డివిజన్లలో నామినేషన్ల వ్యవహారం కూటమి నాయకులకు తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? లేక మిత్రపక్షాల మధ్యే ప్రత్యక్ష పోరు తప్పదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
14వ డివిజన్లో కమలం-గ్లాస్ పోటీ
కడప నగరపాలక సంస్థలోని జనరల్ స్థానమైన 14వ డివిజన్లో భాజపా తరఫున పవన్‌కుమార్ సతీమణి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే డివిజన్ నుంచి జీవీ రమణ తల్లి జనసేన తరఫున బరిలో నిలిచారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కడ భాజపా, జనసేన మధ్య పోటీ నెలకొంది.
ఇరు పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారంతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. దీంతో ఈ డివిజన్లో మిత్రపక్షాల మధ్య పోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
6వ డివిజన్లో భాజపాకు అంతర్గత పోటీ
6వ డివిజన్లో భాజపా నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ నుంచి తప్పుకునేందుకు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ నాయకత్వానికి సమస్య ఎదురైంది. ఎవరికి బీఫారం కేటాయించాలనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
నామినేషన్ల గడువు పొడిగించిన నేపథ్యంలో వైకాపా అభ్యర్థి కూడా ఈ డివిజన్లో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఉపసంహరణ గడువుపైనే అందరి దృష్టి
ఈ రెండు డివిజన్లలో నెలకొన్న సమస్యలను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు కూటమి నాయకులు పరిష్కరిస్తారా? లేదా భాజపా, జనసేన అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మిత్రపక్షాల మధ్య సమన్వయం కుదురుతుందా, చివరకు ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారన్నది తేలాల్సి ఉంది.
Also Read - పలాస-కాశీబుగ్గ అభివృద్ధికి కూటమిని గెలిపించండి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
