కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం; ఏపీకి 48 గంటల వర్ష హెచ్చరిక
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాల అవకాశంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో గురువారం ఉదయం తీరాన్ని దాటింది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ ఉదయం వరకు కొనసాగిందని, భూభాగంపైకి వచ్చినప్పటికీ వ్యవస్థ ఇంకా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
వచ్చే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు భారీ వర్షాల ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీరం దాటే సమయంలో ఈదురు గాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ సరఫరా, రోడ్ల పరిస్థితి, తాగునీటి సరఫరాపై జిల్లా యంత్రాంగాలు నిరంతర సమీక్ష నిర్వహిస్తున్నాయని అధికారులు చెప్పారు.
HIGHLIGHTS
- కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది
- వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాల హెచ్చరిక
- అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రలో యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశించారు. దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పశువులకు గ్రాసం, తాగునీటిని కూడా సిద్ధం చేయాలని ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు.
వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో తీరప్రాంతాలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. వర్షపాతం, గాలుల తీవ్రత తగ్గే వరకు ప్రజలు అనవసర ప్రయాణాలు నివారించాలని అధికారులు సూచించారు. తదుపరి 48 గంటలు పరిస్థితిని బట్టి అదనపు సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
