99TV News

    కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో ఉద్రిక్తత

    కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో టీడీపీ, జనసేన మధ్య ఉద్రిక్తత

    కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో ఉద్రిక్తత

    ఆర్నాడ పంచాయతీలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వాగ్వివాదం, తోపులాట; పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి

    విజయనగరం జిల్లా కురుపాం మండలం ఆర్నాడ పంచాయతీలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సందర్భంగా కురుపాం టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిపై దాడి యత్నం జరిగిందని టీడీపీ వర్గాలు ఆరోపించడంతో ఉద్రిక్తత నెలకొంది.

    ఎమ్మెల్యే జగదీశ్వరి టీడీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారానికి వెళ్లిన సమయంలో కురుపాం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జోగి ప్రసాదమ్మ మద్దతుదారులు ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అని నినాదాలు చేయగా, టీడీపీ శ్రేణులు ప్రతిగా అనుకూల నినాదాలు చేశాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం పెరిగి తోపులాటకు దారితీసింది.

    HIGHLIGHTS

    - ఆర్నాడ పంచాయతీలో శనివారం ఉద్రిక్తత

    - ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచార సమయంలో ఘటన

    - టీడీపీ, జనసేన వర్గాల మధ్య తోపులాట

    - పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి

    సమాచారం అందిన వెంటనే చినమేరంగి సీఐ టి.వి. తిరుపతి రావు, జియ్యమ్మవలస ఎస్ఐ ఎన్. ప్రశాంత్ కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రచారంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దొంకడ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి. సురేష్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు పాల్గొన్నారు.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →