ఏపీలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటన; చంద్రబాబు, పవన్‌తో భేటీ
దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు వచ్చిన మోహన్ యాదవ్ వేర్వేరు సమావేశాలు నిర్వహించారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, రాష్ట్ర నేతలతో పరస్పర అంశాలపై చర్చించారు.
మోహన్ యాదవ్ ముందుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలు కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సహకారం, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆ తర్వాత మోహన్ యాదవ్ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పర్యావరణ, అటవీ, జీవవైవిధ్య అంశాలు ప్రాధాన్యంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంపై ఇరు పక్షాలు మాట్లాడాయి.
జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి గౌర్‌లను నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌కు తరలించే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఈ ఒప్పందాన్ని వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ మోహన్ యాదవ్‌ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అటవీ జీవుల సంరక్షణలో రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
HIGHLIGHTS
- మోహన్ యాదవ్ శనివారం ఏపీలో పర్యటించారు
- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో వేర్వేరు భేటీలు
- గౌర్‌ల తరలింపు ప్రతిపాదనపై చర్చ
- నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌పై ప్రత్యేక దృష్టి
సమావేశం అనంతరం పవన్ కల్యాణ్, మోహన్ యాదవ్‌ను ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. కొండపల్లి, శ్రీకాళహస్తి కళాకృతులతో పాటు అరకు కాఫీని ఆయనకు బహూకరించారు. ప్రతిగా మోహన్ యాదవ్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్ర ప్రసాదాన్ని పవన్ కల్యాణ్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా త్వరలోనే తాను మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. గౌర్‌ల తరలింపు, టైగర్ రిజర్వ్ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య తదుపరి చర్చలు జరగనున్నాయి.
