వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రౌడీషీటర్లకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన పలువురు రౌడీషీటర్లు జగన్తో కలిసి ఉన్న ఫొటోలను లోకేష్ తన 'ఎక్స్' ఖాతాలో విడుదల చేశారు . వైసీపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. పణుగంటి చైతన్య, ఎస్. సందీప్, అవుతు శ్రీనివాసరెడ్డి, బంకా అరుణ్ సహా పలువురి పేర్లను లోకేశ్ ప్రస్తావించారు. దాడికి పాల్పడిన వారు జగన్తో కలిసి ఉన్న చిత్రాలను లోకేష్ సాక్ష్యాలుగా పోస్ట్ చేశారు. జగన్ రౌడీషీటర్ల పక్షాన నిలవగా, తాను మాత్రం ఉపాధ్యాయులు, క్రీడాకారుల పక్షాన నిలబడ్డానని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల వైపు ఉండాలో, రౌడీల వైపు ఉండాలో ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు చినబాబు .
ఇక, విజయవాడలోని శాప్ కార్యాలయంపైకి దండెత్తి అల్లర్లు, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన ఘటనలు తాడేపల్లి ప్యాలెస్ కుట్ర మేరకే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే 18 జిల్లాల నుంచి 89 మంది నాయకుల ఆధ్వర్యంలో 1,719 మందిని 365 వాహనాల్లో విజయవాడకు తరలించాలని వ్యూహం పన్నారని తేల్చారు. కొన్ని బృందాలు విజయవాడకు వచ్చే ముందు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుంచి అందిన ఆదేశాల తర్వాతే వారంతా గురువులపై దాష్టీకానికి తెగబడినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు దాడి, అల్లర్లు అప్పటికప్పుడు జరిగినవి కావని.. పక్కా కుట్రతోనే చేశామని నిర్ధారించినట్టు పోలీసులు చెప్పారు.
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లు, దాడులకు పాల్పడిన వారిలో 205 మందిని పోలీసులు ఇప్పటివరకూ గుర్తించారు. అందులో 103 మందిపై 621 కేసులున్నాయి. వారిపై ఉన్న కేసుల వివరాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకూ 54 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరిలో అత్యధికులు రౌడీ, తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారే. ఈ మూకకు నేతృత్వం వహించి అల్లర్లకు, దాడులకు ఉసిగొల్పిన దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, నాగార్జున యాదవ్ తదితరులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసేసి పరారయ్యారని పోలీసులు గుర్తించారు . వారి కోసమూ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా నుంచి తరలించిన అల్లరి మూకకు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు, నల్లగట్ల స్వామిదాస్, జోగి రమేష్, గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మూకకు అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మూకకు పేర్ని నాని, పేర్ని కిట్టు, నెల్లూరు నుంచి వచ్చిన వారికి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆరాచకశక్తులకు జక్కంపూడి రాజా నేతృత్వం వహించారని పోలీసులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 650 మంది, గుంటూరు నుంచి 225, ఏలూరు నుంచి 200, బాపట్ల- 175, పల్నాడు-165, కృష్ణా నుంచి 140 మందిని ఇలా మొత్తంగా 18 జిల్లాల నుంచి 1,719 మందిని తరలించినట్లు తేల్చారు.
