99TV News

    పల్లె పండుగ 3.0: పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధి ప్లాన్

    పల్లె పండుగ 3.0 పట్టాలపైకి.. పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్య ప్రాజెక్ట్‌కు కొత్త దశ

    పవన్ పారాహుషార్.. పల్లె పండగ 3.0..

    గ్రామ స్వరాజ్య సాధన, పల్లెల సమగ్ర రూపాంతరమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా మూడో దశకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి హామీ అనుసంధానంతో చేపట్టిన తొలి రెండు విడతల పనులు అద్భుత ఫలితాలనివ్వడంతో, ప్రభుత్వం మరింత ఉత్సాహంతో పల్లె పండుగ 3.0 ను పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకెళ్లడంలో ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా మారింది.

    గత రెండు విడతల్లో సాధించిన ప్రగతి గమనిస్తే, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గ్రామీణ రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో అంతర్గత రాకపోకలను సులభతరం చేస్తూ ఏకంగా 9,600 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవగా, మరో 10,000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులను వేగవంతంగా చేపట్టారు. ముఖ్యంగా సుదూర అటవీ, గిరిజన ప్రాంతాలకు శాశ్వత రవాణా వసతి కల్పించాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పంతో తీసుకొచ్చిన అడవి తల్లి బాట కింద రూ.2,078 కోట్ల భారీ వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రోడ్ల పనులను మొదలుపెట్టి, ఇప్పటికే 1,000 కిలోమీటర్లకు పైగా గిరిజన రహదారులను పూర్తి చేసి మారుమూల తండాలు, గూడేలకు బాహ్య ప్రపంచంతో రవాణా సౌలభ్యం కల్పించారు.

    వ్యవసాయం, పశుసంవర్ధక రంగానికి జీవం పోసే దిశగా పల్లె పండుగ మొదటి రెండు దశల్లో రికార్డు స్థాయి పనులు జరిగాయి. భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీటి భరోసా అందించేందుకు ఏకంగా 1.15 లక్షల వ్యవసాయ కుంటలు నిర్మించారు. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో 2 లక్షల ఎకరాల్లో ఉద్యానవన, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. అంతేకాకుండా పాడి రైతుల శ్రేయస్సు కోసం 38,000కు పైగా మినీ గోకులాల నిర్మాణం, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో 15,000 పశువుల తాగునీటి తొట్ల ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశారు.

    గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వినూత్న రీతిలో 54 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించడంతో పాటు, గ్రామీణ ఆధ్యాత్మికతను, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రూ.120 కోట్ల నిధులతో 100కు పైగా పుణ్యక్షేత్రాలు, ప్రముఖ ఆలయాలను అనుసంధానిస్తూ 205 కిలోమీటర్ల ప్రత్యేక రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. మొదటి రెండు విడతల్లో ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ ఘనమైన ఫలితాల స్ఫూర్తితో, ఇప్పుడు పల్లె పండుగ 3.0’ ద్వారా మరిన్ని గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, క్రీడా ప్రాంగణాలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే సరికొత్త ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. ఈ మూడో దశతో ఆంధ్రప్రదేశ్ పల్లెలు సమగ్ర అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నాయని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.