Pithapuram AE Nookaraju Case | ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సౌజన్య లేఖ వైరల్, విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇది లవ్ జిహాద్ తరహా వ్యవహారం అని కామెంట్..
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు విచారించారు. మరోవైపు నూకరాజు కుమార్తె సౌజన్య రాసినట్లు ప్రచారం జరుగుతున్న ఐదు పేజీల లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖలో తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, ఆస్తికి సంబంధించిన ఆరోపణలను సౌజన్య ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
షేక్ సాధిక్ ఖాన్‌ను కాకినాడ సర్పవరం పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఏఎస్పీ, ఐదుగురు సీఐల నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం సాధిక్‌ను వైద్య పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
గోదావరిలో ఆత్మహత్యాయత్నం
ఆగష్టు 16న పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య రాజమహేంద్రవరం సమీపంలో గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురూ గల్లంతయ్యారు.
సౌజన్య కుమారుడు, నూకరాజు మనుమడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం మీనా మృతదేహం లభ్యమైంది. ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
వైరల్‌గా మారిన సౌజన్య లేఖ
ఈ కేసులో తాజాగా సౌజన్య రాసినట్లు ప్రచారం జరుగుతున్న ఐదు పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. అందులో సాధిక్ ఖాన్ తన ఆస్తిపై కన్నేశాడని, భౌతికంగా దాడి చేశాడని ఆరోపించినట్లు సమాచారం. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సౌజన్య పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు రియాన్ష్‌ను కూడా సాధిక్ బెదిరించాడని పేర్కొన్నారు. ఏదైనా తేడా వస్తే బాలుడిని కిడ్నాప్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.
ఆస్తులపై విజయసాయిరెడ్డి కీలక ఆరోపణలు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రావులపాలెంలోని కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. బాలుడి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు లాకర్లకు సంబంధించి సాధిక్‌పై పలు ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు, భూములు, ఇతర ఆస్తులను సాధిక్ స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు.అలాగే జగదీశ్వర్ రెడ్డి మృతికి విషపూరిత పదార్థం కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు.
మతమార్పిడి ఆరోపణలపై దుమారం
సౌజన్యను మతం మార్చేందుకు ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను ఆయన ‘లవ్ జిహాద్ తరహా వ్యవహారం’గా అభివర్ణించారు.
‘యూపీ తరహా ట్రీట్మెంట్’ ఇవ్వాలన్న విజయసాయిరెడ్డి
సౌజన్య పేరుతో వైరల్ అవుతున్న లేఖను ఎక్స్ వేదికగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులను నిరోధించే చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అధికారంలో ఉండి ఉంటే ఉత్తరప్రదేశ్ తరహా చర్యలు తీసుకునేవాడినని వ్యాఖ్యానించారు.
దర్యాప్తుపైనే అసలు ఆధారం
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు సాధిక్ ఖాన్‌ను విచారించడంతో పాటు వైరల్‌గా మారిన లేఖ, ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు, కుటుంబ సభ్యుల మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియ అనంతరం కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
