ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి సమయంలో పెను ప్రమాదం తప్పింది. 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కడప నుంచి విజయవాడకు 33 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో చుండి సమీపానికి చేరుకోగానే బస్సు ముందు టైరు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.
Highlights
- ప్రకాశం జిల్లాలో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
- బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు.
- కడప నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం.
- చుండి సమీపంలో ఒక్కసారిగా పేలిన ముందు టైరు.
- టైరు పేలిన వెంటనే చెలరేగిన మంటలు.
- డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నుంచి బయటపడ్డ ప్రయాణికులు.
- ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.
అదే సమయంలో టైరు పేలిన ప్రాంతం నుంచి మంటలు చెలరేగడాన్ని డ్రైవర్ గుర్తించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి ప్రయాణికులందరినీ వెంటనే అప్రమత్తం చేశారు. ఆలస్యం చేయకుండా అందరినీ బస్సు నుంచి కిందకు దించేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయి కాలి బూడిదైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టైరు పేలిన వెంటనే డ్రైవర్ స్పందించి ప్రయాణికులను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది.
సాధారణంగా ప్రయాణ సమయంలో వాహనాల్లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు క్షణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తి 33 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయి. దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read- అనంతపురం ఆసుపత్రిలో కలకలం.. బెడ్ పైనుంచి కిందపడిన రాప్తాడు దాడి నిందితుడు హేమంత్
