రాయలసీమ రైజింగ్ ప్రాజెక్ట్‌ను నేడు ప్రారంభించనున్న ప్రభుత్వం
రూ.1 లక్ష కోట్ల ప్రణాళికతో 10 జిల్లాల్లో ఉద్యాన పంటల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యం
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్ట్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య జిల్లా బీకేపల్లి వద్ద ప్రారంభించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ప్రాజెక్ట్ కింద రూ.1 లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళిక అమలు కానుంది. పూర్వోదయ పథకం కింద ప్రభుత్వ వాటాగా రూ.40,352 కోట్లు, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఉన్నాయి. 2026 నుంచి 2029 వరకు 3 దశల్లో 10 జిల్లాల 201 క్లస్టర్లలో పనులు చేపట్టనున్నారు. 2029 నాటికి ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 6 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం తెలిపింది.
HIGHLIGHTS
- ప్రాజెక్ట్ విలువ రూ.1 లక్ష కోట్లు
- 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు
- లక్ష్యం 14.41 లక్షల హెక్టార్లు
- రిలయన్స్ సహకారంతో అగ్రికల్చర్ స్కూల్
మౌలిక వసతుల్లో రూ.4,562 కోట్లతో 5,721 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, రూ.20,884 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు ప్రతిపాదించారు. దీంతో 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 4.3 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరగనుంది. ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు కేటాయించారు. సుమారు 9.6 లక్షల మంది రైతులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వాణిజ్యానికి ఇది కేంద్రంగా పనిచేయనుంది. ప్రారంభం అనంతరం దశలవారీ అమలుకు కార్యాచరణ విడుదల కానుంది.
