సింహాచలం వెండి హైదరాబాద్ మింట్‌కు తరలింపు
భక్తుల కానుకలుగా వచ్చిన 1,182.846 కిలోల వెండిని కరిగించి విలువ నిర్ధారించనున్న అధికారులు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన 1,182.846 కిలోల వెండిని అధికారులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ మింట్‌కు తరలించారు. 2019 నుంచి ఆలయంలో భద్రపరిచిన ఈ వెండి విలువ సుమారు రూ.23 కోట్లుగా అంచనా వేశారు.
ఆలయ ఇనుప పెట్టెల్లో ఉంచిన వెండికి దేవస్థానం అధికారులు సీల్ వేసి, భారీ భద్రత మధ్య ప్రత్యేక వ్యాన్‌లో హైదరాబాద్‌కు పంపారు. ఈవో, డిప్యూటీ ఈవో, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక వాహనాల్లో వెండితో పాటు వెళ్లారు. మింట్‌లో వెండిని కరిగించి ఇటుకలుగా మార్చి, నాణ్యతతో పాటు కచ్చితమైన విలువను నిర్ధారిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆ విలువకు సమానంగా బంగారం కొనుగోలు చేసి, దేవస్థానం పేరుతో గోల్డ్ బాండ్లుగా డిపాజిట్ చేయాలనే ప్రతిపాదన ఉంది.
HIGHLIGHTS
- 1,182.846 కిలోల వెండి హైదరాబాద్‌కు తరలింపు
- అంచనా మార్కెట్ విలువ రూ.23 కోట్లు
- 2019 నుంచి వచ్చిన భక్తుల కానుకలు
- శ్రీకాళహస్తి ఆలయం 500 కిలోల వెండి కోరింది
ఇదే సమయంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానం తాపడం పనుల కోసం సుమారు 500 కిలోల వెండి అవసరమని తెలియజేసింది. ఎంఎంటీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా విలువ కట్టి నేరుగా విక్రయించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే, శ్రీకాళహస్తికి విక్రయం లేదా గోల్డ్ బాండ్లుగా మార్పుపై దేవదాయ శాఖ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మింట్ ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి చర్యలు ఖరారు కానున్నాయి.
