ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య కీలకమైన జల పంపకాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం విజయ్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ సమావేశంలో చెన్నై నగరానికి తాగునీరు అందించే తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల విడుదలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపాదిత గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ ఏడాది తమిళనాడుకు కేటాయించిన కృష్ణా జలాల్లో తక్కువ పరిమాణమే అందడంతో, నీటి సరఫరాపై ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు వారిని తమిళనాడు సీఎం విజయ్‌కు పరిచయం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భవిష్యత్తులో నీటి లభ్యతను మెరుగుపరిచే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న విజయ్.. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తన పర్యటనలో భాగంగా విజయ్ రాత్రి జరగనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన చెన్నైకి తిరిగి వెళ్లనున్నారు. చంద్రబాబు, విజయ్ భేటీతో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశాలపై తదుపరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది
