తిరుమలలో కల్పవృక్ష వాహనంపై శ్రీవారి ఊరేగింపు.. గరుడ సేవకు ఏర్పాట్లు
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం కల్పవృక్ష వాహనంపై స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. బకాసుర వధ అలంకారంలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనసేవలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
గురువారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనసేవ నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహనసేవ జరగనుంది. ఈ సేవను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుమలలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. భక్తులు ఈ ఆంక్షలను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
