తిరుపతి జిల్లాలో విద్యుదాఘాతంతో అడవి ఏనుగు మృతి
తిరుపతి జిల్లా-చిత్తూరు జిల్లా సరిహద్దులో అడవి ఏనుగు మృతి చెందింది. ఐరాల మండలం చుక్కావారిపల్లి సమీపంలోని పంట పొలాల్లో శనివారం ఉదయం రైతులు ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు.
ఏనుగు మృతికి విద్యుదాఘాతం కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలంలో తక్కువ ఎత్తులో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగు శరీరంపై మూడు చోట్ల విద్యుత్ తీగలు తగిలిన ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం. ఈ ఘటనపై అటవీ అధికారులకు సమాచారం అందించారు.
గత కొంతకాలంగా ఐరాల మండలంలోని చుక్కావారిపల్లి, గూబలవారిపల్లి, పాకాల మండలంలోని కాకర్లవారిపల్లి, సిలగొందిమూల అటవీ ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంట పొలాల్లోకి వస్తున్న ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి మూడు ఏనుగులు పొలాల వైపు వచ్చినట్లు స్థానిక రైతులు తెలిపారు.
ఏనుగు మృతికి గల ఖచ్చితమైన కారణాలు, విద్యుత్ తీగల పాత్రపై అటవీ అధికారులు పరిశీలన చేపట్టాల్సి ఉంది.
