99TV News

    YSRCP Local Body Poll Strategy | Andhra Pradesh Elections 2026

    YSRCP Local Body Poll Strategy | Andhra Pradesh Elections 2026

    స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి వైసీపీ ప్రణాళిక

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఏ ఒక్క స్థానిక సంస్థ స్థానాన్నీ వదలకుండా అభ్యర్థులను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పరిశీలకులు, సమన్వయ బృందాలకు దిశానిర్దేశం చేశారు.

    పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అభ్యర్థుల ఎంపిక, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, నామినేషన్ల దాఖలు, ప్రచార ఏర్పాట్లను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. రానున్న 15 నుంచి 20 రోజులపాటు పరిశీలకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నిరభ్యంతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల సమయంలో ఆటంకాలు ఎదురైతే వీడియో ఆధారాలతో సహా నమోదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు రోజువారీ నివేదికలు అందేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

    అభ్యర్థులపై కేసుల వివరాల కోసం ఈసీకి వినతి

    మరోవైపు, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. పార్టీ నాయకులు, అభ్యర్థులపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు అందుబాటులో లేకపోవడం నామినేషన్ల సమయంలో ఇబ్బందులకు దారితీయవచ్చని పేర్కొన్నారు.

    అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా వారి పేర్లపై నమోదైన కేసుల జాబితాను లేదా కేసులు లేవనే ధ్రువీకరణను స్థానిక పోలీస్‌ స్టేషన్ల ద్వారా 24 గంటల్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కేసు నంబర్లు, సంబంధిత పోలీస్‌ స్టేషన్ల వివరాలు సులభంగా తెలుసుకునే విధానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

    ఎన్నికల ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తికానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక నుంచి కౌంటింగ్‌ వరకు పార్టీ పరిశీలకులు వారికి అండగా ఉండాలని వైసీపీ నాయకత్వం సూచించింది. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలపై పార్టీ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది.