99TV News

    ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు

    ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు

    ఏపీలో నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు.. 14 ఘటనలు నమోదు

    ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శుక్రవారం ఎనిమిది జిల్లాల్లో 14 ఘటనలు చోటుచేసుకున్నాయని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 17 మంది నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలినవారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

    పల్నాడు, కడప జిల్లాల్లో మూడేసి ఘటనలు నమోదయ్యాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘటన చోటుచేసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

    బారికేడ్ల ధ్వంసం, నామినేషన్ కేంద్రాల ముట్టడి, రహదారుల దిగ్బంధం, ప్రత్యర్థులను బెదిరించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ, డ్రోన్లు, పోలీసుల బాడీ కెమెరాలు, మీడియా, ప్రజల నుంచి సేకరించిన వీడియోలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

    సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించబోమని డీజీపీ స్పష్టం చేశారు.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →