స్థానాల సర్దుబాటుపై కూటమి కసరత్తు.. బీజేపీకి ఎన్ని సీట్లు?
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుసగా రెండో రోజు వెళ్లి స్థానాల సర్దుబాటుపై చర్చించారు.
బీజేపీకి 30 జడ్పీటీసీ స్థానాలు, 30 ఎంపీపీ స్థానాలతో పాటు వందకుపైగా ఎంపీటీసీ స్థానాలు కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తం స్థానాల్లో ఆ పార్టీకి సుమారు ఐదు శాతం కేటాయించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు, జనసేనకు 30 శాతం స్థానాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జడ్పీ ఛైర్‌పర్సన్ పదవుల పంపిణీపైనా ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. తొమ్మిది జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాలను జనసేన కోరగా, అల్లూరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించే ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
జిల్లాలవారీగా స్థానాల పంపిణీపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే పలుచోట్ల మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో, పొత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత అభ్యర్థుల ఉపసంహరణకు సమన్వయ కమిటీలు కృషి చేయనున్నాయి. శనివారం రాత్రి లేదా ఆదివారం నాటికి సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
