మురసు తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి తక్షణమే మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని రెండు తుపానులు చుట్టుముట్టడంతో భారీ నష్టం వాటిల్లిందని లేఖలో వివరించారు.
అక్టోబర్ 27న సంభవించిన 'అర్నాబ్' తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే 'మురసు' తుపాను మరోసారి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ నెట్వర్క్, రహదారులు సహా కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒకే సీజన్లో రెండుసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు.
Highlights
- మురసు తుపాను నష్టంపై కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తక్షణ సాయం కోసం విజ్ఞప్తి
- ఏపీకి ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల నష్టం అంచనా
- 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం
- వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్ల నష్టం
- 6,504 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా రూ.337.10 కోట్ల నష్టం
- విద్యుత్, రహదారులు, పశుసంవర్ధక, ఆక్వాకల్చర్ రంగాలపై ప్రభావం
- 15 రోజుల్లో కేంద్రానికి సమగ్ర నష్ట నివేదిక సమర్పించనున్న ఏపీ ప్రభుత్వం
- బాధితులను ఆదుకునేందుకు మధ్యంతర ఆర్థిక సాయం కోరిన చంద్రబాబు
మురసు తుపానుతో రూ.1,919 కోట్ల నష్టం!
మురసు తుపాను కారణంగా రాష్ట్రానికి ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి తన లేఖలో వెల్లడించారు. ఇందులో వ్యవసాయ రంగానికి భారీ నష్టం జరిగినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, వీటి విలువ సుమారు రూ.874.96 కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా 6,504 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో సుమారు రూ.337.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, ఆక్వాకల్చర్, గృహనిర్మాణం, విద్యుత్, పంచాయతీరాజ్, విద్యా, ఆరోగ్య రంగాలు కూడా తుపాను ప్రభావానికి గురైనట్లు తెలిపారు.
15 రోజుల్లో కేంద్రానికి పూర్తి నివేదిక
ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టానికి సంబంధించి పూర్తిస్థాయి అంచనాలను రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. 15 రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నష్ట నివేదికను సమర్పిస్తామని లేఖలో పేర్కొన్నారు.
తుపాను కారణంగా నష్టపోయిన రైతులు, మత్స్యకారులు, ఇతర బాధితులను ఆదుకోవడంతో పాటు దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తక్షణమే మధ్యంతర ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
