మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం మచిలీపట్నంలోని పాండురంగ హైస్కూల్, నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, పెడన ఫంక్షన్ హాల్, ఉయ్యూరులోని ఏజీఎస్‌జీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల విధుల్లో మెన్, మెటీరియల్, మెథడ్ అనే మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బంది మధ్య సమన్వయం, చెక్‌లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రిని తనిఖీ చేయడం, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్‌బుక్‌లోని నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం అత్యంత ముఖ్యమని వివరించారు.
నిబంధనల ప్రకారమే విధులు
ఎన్నికల ప్రక్రియలో వ్యక్తిగత అంచనాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలు, అధికారిక సూచనల ప్రకారమే ప్రతి చర్య చేపట్టాలని డీకే బాలాజీ స్పష్టం చేశారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ ముగిసిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
బ్యాలెట్ పేపర్ల నిర్వహణలో జాగ్రత్తలు
బ్యాలెట్ బాక్సుల వినియోగం, బ్యాలెట్ పేపర్ల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించేందుకు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
Also Read - స్థానిక ఎన్నికల్లో మంత్రి కుటుంబం సందడి.. తల్లి, భార్య, తమ్ముడు నామినేషన్లు
