మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్ పీఠాన్ని కూడా కూటమి దక్కించుకుంది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన ముక్కా శ్రావణి 2.44 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 120 వార్డులకు గాను టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 డివిజన్లలో గెలుపొందాయి. దీంతో కూటమి మొత్తం బలం 98కి చేరింది. వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించగా, సీపీఎం ఒకటి, స్వతంత్రులు 8 వార్డులను దక్కించుకున్నారు.
అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నితీశ్ రెడ్డి పెదనాన్న కాకి గోవిందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 86వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఆయన, 200కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, కాకి గోవిందరెడ్డి అన్నదమ్ములు.
Highlights
- జీవీఎంసీ ఎన్నికల్లో 86వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాకి గోవిందరెడ్డి విజయం.
- టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆయన పెదనాన్న.
- 200కు పైగా ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్‌గా గెలుపు.
- టీడీపీలో సుమారు 35 ఏళ్ల రాజకీయ అనుభవం.
- పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా బరిలోకి దిగిన గోవిందరెడ్డి.
- ఆయన భార్య శ్రీదేవి 85వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి.
సుమారు 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న గోవిందరెడ్డి టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. గతంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 86వ వార్డు నుంచి టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అభిమానుల ఒత్తిడి మేరకు తన భార్య శ్రీదేవిని కూడా 85వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిపారు. అయితే శ్రీదేవి ఓటమి చెందగా, గోవిందరెడ్డి మాత్రం విజయం సాధించారు. 2021లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈసారి పార్టీ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జీవీఎంసీ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది.
