99TV News

    NTR District Alliance Seat Sharing | జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల పంపకం పూర్తి

    NTR District Alliance Seat Sharing | జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల పంపకం పూర్తి

    ఎన్టీఆర్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మండలాల వారీగా చర్చించిన నేతలు చివరకు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

    టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని స్థానాల కోసం జనసేన నేతలు పట్టుబట్టడం, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు సైతం తమ వైఖరికి కట్టుబడి ఉండటంతో చర్చలు సుదీర్ఘంగా సాగాయి.

    మైలవరంలో సీట్ల పంపకం

    మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఐదు జడ్పీటీసీ స్థానాల్లో నాలుగు టీడీపీకి, ఒకటి భాజపాకు కేటాయించారు. విజయవాడ రూరల్‌ జడ్పీటీసీ స్థానాన్ని భాజపా కోరడంతో ఆ పార్టీకి కేటాయించినట్లు సమాచారం.

    ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 66, జనసేనకు ఏడు స్థానాలు కేటాయించారు.

    తిరువూరులో టీడీపీకి అన్ని జడ్పీటీసీ స్థానాలు

    తిరువూరు నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలనూ టీడీపీకి కేటాయించారు. తిరువూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో జడ్పీటీసీ స్థానాలన్నీ టీడీపీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.

    ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 60, జనసేనకు మూడు కేటాయించారు. జనసేనకు మరిన్ని స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినప్పటికీ, అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ తీసుకోలేదని సమాచారం.

    నందిగామలో జనసేనకు ఒక జడ్పీటీసీ

    నందిగామ నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 52, జనసేనకు ఏడు స్థానాలు దక్కాయి.

    జగ్గయ్యపేటలో సుదీర్ఘ చర్చలు

    జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలుండగా, రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల పంపకంపై ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర చర్చలు జరిగాయి.

    జగ్గయ్యపేట జడ్పీటీసీ స్థానం తమకు కావాలని జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు, ఆ స్థానాన్ని వదులుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే తాతయ్య వర్గం అంగీకరించకపోవడంతో చర్చలు సాయంత్రం వరకు కొనసాగాయి. చివరకు గద్దె అనురాధ నేతలను సమన్వయం చేయడంతో జనసేనకు ఒక జడ్పీటీసీ స్థానాన్ని కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది.

    ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 53, జనసేనకు ఆరు కేటాయించారు.

    సీట్ల సర్దుబాటుకు ముందే నామినేషన్లు

    కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఆలస్యం కావడంతో శుక్రవారం గడువులోగా పలుచోట్ల టీడీపీ, జనసేన, భాజపా నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్దుబాటు పూర్తయిన నేపథ్యంలో ఏ పార్టీకి ఏ స్థానం కేటాయించారో అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు కొనసాగనున్నారు. మిగతా పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకోనున్నారు.

    Also Read - స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు తావివ్వొద్దు.. పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ డీకే బాలాజీ సూచనలు

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →