చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూటమిలోని వేర్వేరు పార్టీల తరఫున జడ్పీటీసీ స్థానానికి పోటీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య నెలకొన్న ఈ రాజకీయ పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది.
ఒకరు జనసేనలో.. మరొకరు టీడీపీలో!
గురుకువారిపల్లెకు చెందిన రఘురాం చౌదరి, వెంకటేశ్వర చౌదరి అన్నదమ్ములు. వీరిలో అన్న రఘురాం చౌదరి ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆయన భార్య మమత జనసేన తరఫున తవణంపల్లె జడ్పీటీసీ అభ్యర్థినిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు, తమ్ముడు వెంకటేశ్వర చౌదరి టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా అదే జడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున గురువారం నామపత్రాలు సమర్పించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు కూటమిలోని వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచిన పరిస్థితి ఏర్పడింది.
Highlights:
తవణంపల్లెలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు
జనసేన తరఫున మమత నామినేషన్
టీడీపీ తరఫున వెంకటేశ్వర చౌదరి పోటీ
కూటమి ఓట్లపై ప్రభావం పడుతుందనే చర్చ
కూటమి ఓట్లపై ప్రభావం పడుతుందా?
టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఒకే స్థానంలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీ పడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ బరిలో కొనసాగితే కూటమి ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనివల్ల ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ పోటీపై కూటమి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇద్దరిలో ఎవరు బరిలో కొనసాగుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ, పార్టీ నాయకుల చర్చల తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read- నామినేషన్ల వేళ పోలీసుల తీరుపై విమర్శలు.. టీడీపీ నేతలకు అడ్డంకులు, వైకాపాకు మినహాయింపులంటూ ఆరోపణలు
