99TV News

    పార్నపల్లిలో వైఎస్ అవినాశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు | AP Elections

    పార్నపల్లిలో వైఎస్ అవినాశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు | AP Elections

    ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

    పులివెందుల సమీపంలోని పార్నపల్లిలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎంపీకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు జిల్లాలోకి చొరబడ్డారని ఆరోపించారు. వారు రాళ్లు, కర్రలతో తిరుగుతూ వైసీపీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

    Highlights

    - పార్నపల్లిలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.

    - పోలీసులకు, ఎంపీకి మధ్య తీవ్ర వాగ్వాదం.

    - బయటి వ్యక్తులు జిల్లాలోకి వచ్చి వైసీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపణ.

    - ఆర్. తుమ్మలపల్లిలో రాళ్లు, సోడా బాటిళ్లతో ఇరు వర్గాల దాడులు.

    - గుండ్లకుంటలో పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించారనే ఆరోపణ.

    - ఉద్రిక్త ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.

    పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో పార్నపల్లిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    మరోవైపు, ఆర్. తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

    పెద్దముడియం మండలం గుండ్లకుంటలోని రెండు పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు బయటకు పంపించినట్లు సమాచారం. పోలీసులు జోక్యం చేసుకుని వారిని తిరిగి పోలింగ్ కేంద్రాల్లోకి పంపించారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    Also Read- మైలవరంలో వైసీపీకి ఊహించని షాక్.. పోలింగ్ వేళ ఎన్నికల బహిష్కరణకు అభ్యర్థి నిర్ణయం!

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →