99TV News

    పులివెందులలో పోలింగ్ ఘర్షణలు.. రాళ్ల దాడిలో ఒకరికి గాయాలు

    పులివెందులలో పోలింగ్ ఘర్షణలు.. రాళ్ల దాడిలో ఒకరికి గాయాలు

    వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు, సీసాలతో దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనల్లో ఒకరు గాయపడటంతో పులివెందుల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

    పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన రాళ్ల దాడిలో కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది.

    మరోవైపు లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్ ఏజెంట్ల విషయంలో వివాదం చెలరేగింది. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు.

    Highlights

    - పులివెందుల నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ ఘర్షణలు.

    - ఆర్. తుమ్మలపల్లిలో రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డికి గాయాలు.

    - పార్నపల్లెలో పోలింగ్ ఏజెంట్ల విషయంలో వివాదం.

    - ఎంపీ అవినాష్ రెడ్డిని మార్గమధ్యంలో అడ్డుకున్న పోలీసులు.

    - గుండ్లకుంటలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట.

    - సమస్యాత్మక గ్రామాల్లో భారీ పోలీసు బందోబస్తు.

    అలాగే పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

    ఎర్రిపల్లిలో పోలీసులు ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో అక్కడ కూడా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వరుస ఘటనల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

    Also Read- మైలవరంలో వైసీపీకి ఊహించని షాక్.. పోలింగ్ వేళ ఎన్నికల బహిష్కరణకు అభ్యర్థి నిర్ణయం!

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →