ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో నెల్లూరు జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనలేని పరిస్థితుల్లోనూ ఓ అభ్యర్థి జడ్పీటీసీగా విజయం సాధించారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పెళ్లకూరు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పోటీ చేశారు. అయితే, ఒక హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
HIGHLIGHTS:
- నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత.
- పెళ్లకూరు జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ.
- ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టిన కుటుంబ సభ్యులు.
- సమీప టీడీపీ అభ్యర్థిపై 1,719 ఓట్ల మెజారిటీతో విజయం.
- ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండానే జడ్పీటీసీగా ఎన్నిక.
ఈ పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలను చేపట్టారు. మండలంలోని ప్రతి గ్రామంలో, ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. సత్యనారాయణ రెడ్డికి స్థానికంగా ఉన్న పరిచయాలు, ప్రజా సంబంధాలను వివరిస్తూ ఆయన తరఫున ఓట్లు అభ్యర్థించారు. ఆయన గెలుపు కోసం కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజాగా వెలువడిన ఫలితాల్లో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థిపై 1,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి స్వయంగా పాల్గొనకుండానే గెలుపొందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కుటుంబ సభ్యుల ప్రచారం, అభ్యర్థికి స్థానికంగా ఉన్న మద్దతు ఈ విజయానికి కారణాలుగా చర్చించుకుంటున్నారు.
Also Read- ఎంపీటీసీల్లో ఒక పార్టీ హవా.. జడ్పీటీసీల్లో మరో పార్టీ విజయం.. ఏపీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం!
