విమానం లో ప్రయాణించే ప్రయాణికులపై మరోసారి భారం పడనుంది. దేశీయ విమానయాన సంస్థైన ఇండిగో టికెట్లపై ఇంధన ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 6 నుంచి కొత్తగా బుక్ చేసుకునే టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి. విమానాల్లో ప్రయాణ దూరాన్ని బట్టి ఇంధన ఛార్జీలను నిర్ణయించారు. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్లకు రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్లకు రూ.900, 1,501 నుంచి 2,000 కిలోమీటర్లకు రూ.1,150 చొప్పున వసూలు చేయనున్నారు. 2,000 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు రూ.1,300 అదనపు ఇంధన ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ విమాన ప్రయాణికులపైనా ఇదే విధమైన భారం పడనుంది. సార్క్ దేశాలకు వెళ్లే విమానాల్లో దూరాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఇంధన ఛార్జీ విధించనున్నారు. సౌత్ ఈస్ట్ ఏషియా, గల్ఫ్, మధ్యప్రాచ్యం, ఉత్తర, తూర్పు ఆసియా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.5,500, ఆఫ్రికా దేశాలకు రూ.6,000, యూరప్ ప్రయాణాలకు రూ.10,000 చొప్పున అదనపు ఛార్జీ వర్తించనుంది.ఇటీవల ఏటీఎఫ్ ధరలు గణనీయంగా పెరగడంతో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా విమాన ఇంధనమే విమానయాన సంస్థల వ్యయంలో కీలక భాగం కావడంతో ధరల పెరుగుదల ప్రభావం నేరుగా టికెట్ ధరలపై పడుతోంది. ప్రయాణికులపై భారం పూర్తిగా పడకుండా పరిమిత స్థాయిలోనే ఇంధన ఛార్జీలను పెంచినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.
ఇండిగో ఇంధన ఛార్జీలు పెంపు: టికెట్లపై అదనపు భారం
