సునీల్ భారతి మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సంబంధాలు, టెలికాం, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో కృషికి గుర్తింపు
భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్‌లో నైట్ హోదా ప్రదానం కానుంది. అక్టోబర్ 28, 2026న న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ గౌరవాన్ని అందజేయనున్నారు.
భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సంబంధాలను మూడు దశాబ్దాలకు పైగా బలోపేతం చేయడంలో మిట్టల్ పాత్రను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతి ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. టెలికమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఆయన కృషి ఈ గౌరవానికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. “భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, టెక్నాలజీ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మిట్టల్ చేసిన సేవలకు ఇది గుర్తింపు,” అని భారతి ఎంటర్‌ప్రైజెస్ ప్రకటనలో తెలిపింది.
మిట్టల్‌కు ఫ్రాన్స్‌తో వ్యాపార సంబంధాలు 1992లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఫ్రెంచ్ సంస్థ కంపనీ జెనరాలే దెజో భారత్‌లో మొబైల్ టెలిఫోనీ ప్రవేశానికి ఆయనతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం మిట్టల్ పారిస్ కేంద్రంగా ఉన్న శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ యూటెల్‌సాట్‌కు కో-ఛైర్మన్‌గా ఉన్నారు. “టెలికాం నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్ వరకు విస్తరించిన ఈ భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలకు బలం చేకూర్చింది,” అని కంపెనీ తెలిపింది.
HIGHLIGHTS
- అక్టోబర్ 28, 2026న న్యూఢిల్లీలో పురస్కార ప్రదానం
- సునీల్ మిట్టల్‌కు షెవాలియర్ హోదా
- భారత్-ఫ్రాన్స్ టెలికాం సంబంధాలకు గుర్తింపు
- 1992లో ఫ్రాన్స్‌తో మిట్టల్ వ్యాపార ప్రయాణం ప్రారంభం
లీజియన్ ఆఫ్ ఆనర్‌ను 1802 మే 19న నెపోలియన్ బోనపార్ట్ స్థాపించారు. పౌర, సైనిక రంగాల్లో విశిష్ట సేవలకు ఈ పురస్కారం ఇస్తారు. ఇందులో షెవాలియర్, ఆఫిసియర్, కమాండ్యూర్, గ్రాండ్ ఆఫిసియర్, గ్రాండ్ క్రొయ్ అనే 5 స్థాయిలు ఉన్నాయి. మిట్టల్‌కు షెవాలియర్ హోదా ప్రదానం కానుంది.
మిట్టల్‌కు 2007లో పద్మభూషణ్ లభించింది. 2024లో బ్రిటన్ రాజు చార్ల్స్ 3 ఆయనకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవ నైట్ కమాండర్ పురస్కారం ప్రకటించారు. తాజా ఫ్రెంచ్ గౌరవంతో ఆయన అంతర్జాతీయ పురస్కారాల జాబితాలో మరో ప్రముఖ గుర్తింపు చేరనుంది. అక్టోబర్ 28న జరిగే కార్యక్రమంలో ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతినిధులు, భారతి గ్రూప్ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.
