తెలంగాణలో రెండు కొత్త గెకో జాతుల గుర్తింపు
జెడ్ఎస్ఐ, నెహ్రూ జూ శాస్త్రవేత్తల పరిశోధనతో తెలంగాణ ఎండెమిక్ గెకో జాతులు 6కు చేరిక
తెలంగాణ జీవవైవిధ్యంలో 2 కొత్త బల్లి జాతులు నమోదయ్యాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నెహ్రూ జూలాజికల్ పార్క్ శాస్త్రవేత్తలు నల్గొండ, వరంగల్ జిల్లాల్లో హెమిడాక్టైలస్ కైర్నికోలా, హెమిడాక్టైలస్ కోయాఓరమ్ జాతులను గుర్తించి ధ్రువీకరించారు.
భారత్ భూపతి, సుమిత్ రే, డాక్టర్ బి. లక్ష్మీనారాయణ, అమృత బాలన్, డాక్టర్ దీపా జైస్వాల్, డాక్టర్ ప్రత్యూష్ పి. మొహపాత్రా సభ్యులైన బృందం 3 ఏళ్ల అధ్యయనం అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. ఈ పరిశోధన వివరాలు ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ’లో ప్రచురితమయ్యాయి. శారీరక లక్షణాలు, జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా ఇవి ప్రత్యేక జాతులని నిర్ధారించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త గుర్తింపుతో తెలంగాణకే పరిమితమైన గెకో జాతుల సంఖ్య 6కు చేరింది.
హెమిడాక్టైలస్ కైర్నికోలా నల్గొండ జిల్లా వర్ధమానిగూడెం సమీపంలోని రాతి నిర్మాణాల వద్ద లభించింది. దీని శరీర పరిమాణం సుమారు 49 మిమీ ఎస్వీఎల్గా నమోదైంది. హెమిడాక్టైలస్ కోయాఓరమ్ వరంగల్ జిల్లా పాఖాల్ వన్యప్రాణి అభయారణ్యంలో గుర్తించారు. కోయా గిరిజన తెగ సంస్కృతికి గౌరవంగా దీనికి ఆ పేరు పెట్టినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ జాతి సుమారు 55.6 మిమీ ఎస్వీఎల్ పరిమాణంతో కైర్నికోలా కంటే పెద్దదిగా ఉంది.
HIGHLIGHTS
- తెలంగాణలో 2 కొత్త గెకో జాతులు గుర్తింపు
- ఎండెమిక్ గెకో జాతుల సంఖ్య 6కు చేరిక
- 3 ఏళ్ల పరిశోధన తర్వాత శాస్త్రీయ ధ్రువీకరణ
- జన్యుపరంగా 9.5 నుంచి 10 శాతం వ్యత్యాసం
ఈ 2 జాతులు జన్యుపరంగా 9.5 నుంచి 10 శాతం వరకు వ్యత్యాసం కలిగి ఉన్నాయని బృందం స్పష్టం చేసింది. “తూర్పు కనుమల్లో ఇంకా విస్తృత స్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది,” అని జెడ్ఎస్ఐ శాస్త్రవేత్త డాక్టర్ ప్రత్యూష్ పి. మొహపాత్రా తెలిపారు. స్థానిక భౌగోళిక నిర్మాణాలు, అడవి వ్యవస్థలు చిన్న సరీసృపాల పరిణామంలో కీలకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పాఖాల్ అభయారణ్యం, వర్ధమానిగూడెం పరిసరాల్లో మరింత ఫీల్డ్ సర్వే చేపట్టి, ఈ జాతుల విస్తరణ పరిధి, నివాస పరిస్థితులు, సంరక్షణ అవసరాలు అంచనా వేయాలని పరిశోధకులు సూచించారు. తదుపరి దశలో తూర్పు కనుమల తెలంగాణ భాగంలో అదనపు నమూనాల సేకరణ, డీఎన్ఏ విశ్లేషణ కొనసాగనుంది.
