ఐఐటీ మద్రాస్ బీటెక్ ఇంటర్న్‌షిప్ 6 నెలలకు పెంపు
2027 జనవరి నుంచి అమలు; పరిశ్రమ అనుభవం, ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ల పెంపే లక్ష్యంగా నిర్ణయం
ఐఐటీ మద్రాస్ బీటెక్ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ విధానంలో కీలక మార్పు ప్రకటించింది. ఇప్పటి 2 నెలల వేసవి ఇంటర్న్‌షిప్‌కు బదులుగా 6 నెలల సుదీర్ఘ విధానం 2027 జనవరి నుంచి అమల్లోకి రానుంది. 2024లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.
ఇనిస్టిట్యూట్ కెరీర్ పాత్‌వే సెంటర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు 6వ సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. పరిశ్రమల ఫీడ్‌బ్యాక్, విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని సీపీసీ చైర్‌పర్సన్ రిచా అగర్వాల్ తెలిపారు. “2 నెలల్లో కీలక ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు సవాలుగా ఉండేది,” అని ఆమె అన్నారు. “6 నెలల వ్యవధి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కంపెనీలకు, పరిశ్రమ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు ఉపకరిస్తుంది,” అని ఆమె వివరించారు.
HIGHLIGHTS
- కొత్త విధానం 2027 జనవరి నుంచి అమలు
- 2024 బ్యాచ్ విద్యార్థులకు వర్తింపు
- 30కి పైగా కంపెనీలు ఎంపిక ప్రక్రియలో
- 150 మందికి పైగా విద్యార్థుల నమోదు
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి మాట్లాడుతూ, “మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమల పనితీరుపై విద్యార్థులకు లోతైన అవగాహన అవసరం,” అని అన్నారు. “సుదీర్ఘ ఇంటర్న్‌షిప్‌లతో ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ల అవకాశాలు మెరుగుపడతాయి,” అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే 30కి పైగా కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. 150 మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను పరిశ్రమల్లో అమలు చేసే అవకాశం పొందనున్నారు. భారతీయ కంపెనీలతో పాటు విదేశీ సంస్థల్లో కూడా అవకాశాలు అన్వేషిస్తున్నట్లు ఇనిస్టిట్యూట్ తెలిపింది.
