Hanumanam: చిన్న బడ్జెట్ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న త్రివిక్రమ్
హైదరాబాద్: భారీ బడ్జెట్ సినిమాలకు భిన్నంగా భక్తి, ఆధ్యాత్మికతను ప్రధానాంశంగా తీసుకుని రూపొందిన ‘హనుమానం’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.
నేమ్ కరోలి బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక భావజాలం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఉత్తర భారతంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
సినిమా ప్రమోషన్‌లోనూ ‘హనుమానం’ బృందం భిన్నమైన విధానాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. ప్రచార కార్యక్రమాల కంటే అన్నదానం, భక్తులతో అనుసంధానం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. దీంతో సినిమాకు మౌత్ టాక్ ద్వారా ఆదరణ పెరిగిందని చిత్రబృందం పేర్కొంది.
నేమ్ కరోలి బాబాను హనుమంతుడి భక్తుడిగా విశ్వసించే భక్తులు ఆయన బోధనల్లో ప్రేమ, సేవ, భగవంతుడి స్మరణకు ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఈ ఆధ్యాత్మిక అంశాలను దర్శకుడు విశాల్ చతుర్వేది తెరపై ఆవిష్కరించినట్లు చిత్రబృందం చెబుతోంది.
భారీ స్టార్ కాస్ట్, వందల కోట్ల బడ్జెట్ లేకుండానే కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రంగా ‘హనుమానం’ ఇప్పటికే చర్చలోకి వచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ సమర్పణతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
సెప్టెంబర్ 18న ‘హనుమానం’ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఈ ఆధ్యాత్మిక కథను ఏ మేరకు ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
