రంభ ఊర్వశి మేనక' చిత్రంతో సినీప్రియుల్ని నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు మాస్ కామెడీ కింగ్ అల్లరి నరేశ్. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమాని దర్శకుడు చంద్ర మోహన్ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సెప్టెంబరు 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ సాగిందిలా..
"బాబూ రెడీ బాబూ.. స్టార్ట్ కెమెరా” అంటూ డైరెక్టర్ బోయపాటిని అనుకరిస్తూ నరేశ్ చేసే హంగామాతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆఖర్లో 'ఓజీ'లోని పవన్ కల్యాణ్ డైలాగ్ పేరడితో ఫన్నీగా ముగిసింది. ఈ మధ్యలో అల్లరి నరేశ్ మార్క్ పంచ్‌లు, రంభ - ఊర్వశి - మేనక పాత్రలతో కలిసి హీరో చేసే అల్లరి, స్వర్గలోక నేపథ్యం ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా ఇంద్రుడిగా వెన్నెల కిశోర్ చేసిన హంగామా నవ్వులు పూయిస్తోంది.
ఆకట్టుకుంటున్న డైలాగ్స్..
ఈ ట్రైలర్‌ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇది ఫాంటసీ అంశాలతో నిండిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. "నువ్వు సుకుమార్‌లా మరీ కాంప్లికేటెడ్ ఆలోచిస్తున్నావు రా.. అనిల్ రావిపూడిలా సింపుల్‌గా ఆలోచించు" అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిశోర్, సీనియర్ నరేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, రాంరెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చారు.
