సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సుదీర్ఘమైన సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన కుమార్తె, ప్రముఖ దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన తండ్రి ఆత్మకథ రాసే పనిలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు.
'ఒక యోగి ఆత్మకథ' స్థాయిలో ఉంటుంది..
"నాన్నగారు ప్రస్తుతం తన ఆత్మకథను రాస్తున్నారు. ఆ పుస్తకం ఎలా రూపుదిద్దుకుంటుందో నేను దగ్గరుండి చూస్తున్నాను. ఇది ఖచ్చితంగా పాఠకులు మళ్లీ మళ్లీ చదివే పుస్తకంగా నిలిచిపోతుందని నా నమ్మకం. పరమహంస యోగానంద గారు రాసిన 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకం తరతరాలకు ఎంతటి స్ఫూర్తినిస్తుందో.. మా నాన్నగారి కథ కూడా అలాగే ఉంటుంది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఆయన ప్రయాణం సామాన్యమైనది కాదు. గత ఐదు దశాబ్దాలుగా ఆయన వృత్తిపరమైన విజయాలు, వ్యక్తిగత అనుభవాలు, అగ్రస్థానానికి చేరుకోవడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇందులో ఉంటాయి" అని సౌందర్య పేర్కొన్నారు.
బయోపిక్ తీస్తే.. నాన్న చెప్పిన పాఠాలివే!
తన తండ్రి జీవితాన్ని వెండితెరపైకి బయోపిక్‌గా తీసుకువస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సౌందర్య స్పందిస్తూ.. "ఒకవేళ నాన్నగారి బయోపిక్ తీస్తే, అది నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత ప్రత్యేకమైనది అవుతుంది. నాన్నగారు నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు.. 'సృజనకు స్పష్టత, క్రమశిక్షణ చాలా అవసరం. ఒక దర్శకుడు తన బుర్రలోని ఆలోచనలన్నింటినీ ఒకే కథలో పెట్టేయకూడదు. ఏ కథకు ఏది అవసరమో అంతే వాడుకుని, మిగిలినవి భవిష్యత్తు కథల కోసం దాచుకోవాలి' అని నేర్పించారు. రజనీకాంత్ గారికి కుమార్తెగా పుట్టడం నా అదృష్టం. ఆయన కూతురిని కాబట్టి నాపై అంచనాలు, పోలికలు ఉండటం సహజం. నేను ఇష్టపూర్వకంగానే ఇండస్ట్రీకి వచ్చాను, దీనిపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు" అని అన్నారు.
అక్టోబర్‌లో '#లవ్' వెబ్ సిరీస్..
ప్రస్తుతం సౌందర్య రజనీకాంత్ నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్ కోసం '#లవ్' (#Love) అనే తమిళ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ అక్టోబరులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
